
మొండి భైరవకోన..వైఎస్సార్ కడప జిల్లా నల్లమల అడవుల్లో ఉన్న ఒక మహిమాన్వితమైన ఆధ్యాత్మిక స్థలం. పురాతన గుహల క్షేత్రం కూడా. ఈ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందనడానికి ఓ కథ ప్రచారంలో ఉంది.

దాదాపు 300 ఏళ్ల క్రితం నల్లపుశెట్టిపల్లి అనే గ్రామంలో భైరవ కొండన్న అనే బాలుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే అతనికి ఆధ్యాత్మిక భావనలు ఉండేవి. ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు రాక, వాగులు, వంకలు ఎండిపోయాయి. ఆవులు దాహంతో బాధపడుతున్నాయి. వాటి బాధను చూసి కొండన్న తట్టుకోలేక.. నా ఆవుల దాహం తీర్చే నీటిని ప్రసాదిస్తే, నా తలను నీకు సమర్పిస్తాను అని భైరవుడిని మొక్కుకున్నాడు.

ఆ మొక్కు చేసిన వెంటనే కొండ చీలిపోయి నీటి బుగ్గ ఉబికి వచ్చింది. ఆవులు నీళ్లు తాగి సంతృప్తిగా ఇంటికి వెళ్లాయి. ఆనందంతో కొండన్న తన తలను చెట్టుకు ముడి వేసి, కత్తితో తల నరికి భైరవునికి సమర్పించాడు. తల చెట్టుకు వేలాడుతూ, మొండెం నేలపై పడిపోయింది.గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఈ ఘట్టాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

ఆ స్థలంలో తలలేని విగ్రహాన్ని ప్రతిష్టించి, భక్తి స్థలంగా మార్చారు. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని “మొండి భైరవకోన” అని పిలుస్తారు.

భక్తి, త్యాగం, ప్రకృతి అద్భుతాల మేళవింపు అయిన భైరవకోనకు.. శివరాత్రి రోజున మాత్రమే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. మిగిలిన రోజుల్లో ఇది శాంతమైన, రహస్యభరితమైన ప్రదేశంగా ఉంటుంది.

భైరవకోన గుడికి పడమరగా నీటి బుగ్గ నిత్యం ఉబికి వస్తూనే ఉంటుంది, ఇది కొండన్న త్యాగానికి గుర్తుగా భావిస్తారు. మొండి బైరవకోన కథ స్థానికంగా ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఇది భైరవకోన ఆలయం పేరు మీదనే ప్రసిద్ధి చెందింది.

మైదుకూరు నుంచి పోరుమామిల్ల రోడ్ లో ప్రయాణించి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

ఇక్కడ ఉచిత ప్రవేశం ఉంటుంది మరియు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించవచ్చు.









