
టీడీపీలో వర్గపోరు బట్టబయలు
మర్రిపాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత, కొత్త టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ప్రతి విషయంలో బహిర్గతమవుతోంది. విచారణ అధికారుల సాక్షిగా టీడీపీలో వర్గపోరు బట్టబయలైంది. మండలంలోని కంపసముద్రం ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ డబ్బుగొట్టు వెంకటసుబ్బయ్య అవినీతికి పాల్పడుతున్నాడంటూ గ్రామానికి చెందిన టీడీపీలోని ఓ వర్గానికి చెందిన స్వాతిరెడ్డి గత సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏపీడీ ప్రతాప్‌రెడ్డి, ఏపీఓ పీ వెంకటనారాయణ ఈ సోమవారం విచారణకు వచ్చారు. మరో వర్గం నాయకులు విచారణ ప్రాంతానికి చేరుకుని విచారణను అడ్డుకున్నారు. ఫీల్డ్‌అసిస్టెంట్ విధులు సక్రమంగానే చేస్తున్నారని, అతనిపై ఎలాంటి విచారణ చేపట్టాల్సిన అవసరం లేదంటూ అధికారులకు తెలిపారు. దీంతో అక్కడే ఉన్న ఫిర్యాదు చేసిన టీడీపీ వర్గం నాయకులతో మాటల యుద్ధం జరిగింది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను బయటకు పంపించేశారు.