పెన్నా బ్యారేజ్‌తో.. | - | Sakshi
Sakshi News home page

పెన్నా బ్యారేజ్‌తో..

Sep 2 2025 9:07 AM | Updated on Sep 2 2025 9:07 AM

పెన్న

పెన్నా బ్యారేజ్‌తో..

● సూళ్లూరుపేట నియోజకవర్గంలో సెజ్‌లు ఏర్పాటు చేసి పారిశ్రామికాభివృద్ధితో ఆ ప్రాంతం ముఖచిత్రాన్ని మార్చేశారు. మూడు సెజ్‌ల్లో పారిశ్రామికంగా అభివృద్ధి వైపు పరుగులు తీయించి ప్రజల జీవన స్థితిగతుల్లో పెనుమార్పులు తీసుకువచ్చారు. గతంలో ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉండేది. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాజీవ్‌ పల్లెబాట కార్యక్రమాన్ని తడ నుంచి ప్రారంభించారు. ఆ సమయంలో నిరుద్యోగ యువతను చూసిన ఆయన ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తడ మండలం మాంబట్టు, నెల్లూరు – చిత్తూరు జిల్లాల సరిహద్దులో సత్యవేడు, వరదయ్యపాళెం, తడ మండలాలను కలుపుకుని సుమారు ఆరు వేల ఎకరాల్లో శ్రీసిటీ సెజ్‌ ఏర్పాటయ్యాయి. నాయుడుపేటలోని మేనకూరును కలిపి మూడు సెజ్‌ల్లో సుమారు 220 కంపెనీలు ఏర్పాటు చేశారు. ఎంతో మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన ఘనతను వైఎస్సార్‌ దక్కించుకున్నారు.

● 2008 మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మేనకూరు సెజ్‌లో భూమి పూజ చేసి పరిశ్రమలకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ చిన్న, మధ్య తరహా భారీ పరిశ్రమలతో కలిపి 25కు పైగా ఉన్నాయి. పోర్టులు, విమానాశ్రయాలు దగ్గర్లో ఉండడం, జలవనరులు పుష్కలంగా ఉండడంతో ఈ సెజ్‌ పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతోంది. హిందూస్థాన్‌ నేషనల్‌ గ్లాస్‌, గ్రీన్‌టెక్‌, లాయల్‌ టెక్స్‌టైల్స్‌, ప్రైమ్‌ మేడిన్‌, హీమెయిర్‌, అరబిందో ఫార్మా తదితర భారీ పరిశ్రమలున్నాయి.

వైఎస్సార్‌.. ఈ పేరు వింటే అన్నదాతే కాదు.. పుడమి తల్లి పులకిస్తోంది. వర్షపు నీటిని ఒడిసి పట్టి సాగుకు మళ్లించిన అపర భగీరథుడు. సింహపురి సిగలోని జలనిధి నుంచి జిల్లా నలుమూలలకు గంగమ్మను ఉరకలెత్తించారు. బంజరు భూములకు జలసిరులు అందించి బంగరు భూములుగా మార్చిన పాలక కర్షకుడు. జలయజ్ఞంతో డెల్టానే కాకుండా మెట్టలో ముక్కారు పంటలతో అన్నపూర్ణగా తీర్చిదిద్దారు. ఉమ్మడి జిల్లా తీరంలో మధ్య భాగంగా కృష్ణపట్నంలో పోర్టు నిర్మించి ప్రపంచ స్థాయి పటంలో నెల్లూరుకు స్థానం కల్పించిన భవిష్యత్‌ స్వాప్నికుడు. పవర్‌ ప్రాజెక్ట్‌లతో ఉమ్మడి జిల్లాలో వెలుగులు నింపిన వెన్నెల రేడు. పారిశ్రామిక సెజ్‌లతో విదేశీ సంస్థలను స్థాపించి అభివృద్ధికి బీజాలు వేసిన పాలికుడు. నిరుద్యోగాన్ని రూపు మాపి లక్షల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన వల్లభుడు. దశాబ్దన్నర కాలం గడిచినా జిల్లా అన్నదాతల మదిలో రాజన్న స్థానం పదిలం.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: డాక్టర్‌ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి 5 ఏళ్ల 3 నెలల ముఖ్యమంత్రి పరిపాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలు చరిత్రకొక్కడుగా చిరస్మరణీయం అయ్యారు. ఆ పెద్దాయన ప్రజల నుంచి దూరమై 16 వత్సరాలు గడిచిపోయినా.. నేటికీ జనం గుండెల్లో గూడు కట్టుకునే ఉన్నారు. క్రీ.పూ. క్రీ.శ. అన్నట్లు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిపాలనలోనూ, అభివృద్ధిలోనూ వైఎస్సార్‌ ముందు, వైఎస్సార్‌ తర్వాత అంటూ అభివర్ణిస్తూ, విశ్లేషిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఆ కోవలోనే నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌ చేసిన అభివృద్ధి అజరామరంగా నిలిచిపోయాయి.

అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన సింహపురిని జలసిరిగా మార్చిన జలయాజ్ఞికుడు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు వందల రూ.కోట్లతో పునాదులు వేసి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన పాలక కర్షకుడు. 2004 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ చేపట్టిన పాదయాత్ర తర్వాత జిల్లాలో బస్సు యాత్రలో అడుగడుగునా అన్నదాతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో సాగునీటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. జలయజ్ఞం ద్వారా వందల రూ.కోట్లతో సమగ్ర సోమ శిల నుంచి పెన్నా, సంగం బ్యారేజీల నిర్మాణం వరకు అన్నింటికి ఆయన అంకురార్పణ చేశారు.

వృథా నీటిని ఒడిసి పట్టి..

వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణా నది వరద నీటిని శ్రీశైలం డ్యాం నుంచి కరువు ప్రాంతమైన రాయలసీమకు కేవలం 1,500 క్యూసెక్కుల తరలించేందుకు గతంలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులని చెప్పినా వాస్తవంగా 1.10 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు దాదాపు 10 టీఎంసీలు తరలించే విధంగా అభివృద్ధి చేశారు. పెన్నార్‌ డెల్టాతో పాటు మెట్ట ప్రాంత భూములను సస్య శ్యామలం చేసేందుకు జలయజ్ఞం ద్వారా రూ.220 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సోమశిల ప్రాజెక్ట్‌ ద్వారా 5,84,500 ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు ప్రతిపాదన చేశారు. ఇందులో 4,05,500 ఎకరాలు మాగాణి భూములతో పాటు కొత్తగా 1,79,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. దీంతో ఇప్పటికి దాదాపు 5,34,583 ఎక రాలకు పారుదల జరుగుతోంది. 49,917 ఎకరాలు ఆయ కట్టు పారుదల జరగాల్సి ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణానది జలాలు సోమశిల రిజర్వాయర్‌ నుంచి కండలేరు జలాశయానికి, చైన్నె తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు పంపాల్సి ఉంది.

సంగం బ్యారేజ్‌ నిర్మాణంతో..

జిల్లాలోనే కీలక ప్రాజెక్ట్‌లైన సంగం, పెన్నా బ్యారేజీలపై దృష్టి సారించి 2006 మే 28న రూ.98 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీ శంకుస్థాపన చేశారు. 800 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించి 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు డెల్టా స్థిరీకరణకు దోహదపడేలా సిద్ధం చేశారు. అయితే నిర్మాణ వ్యయం పెరగడంతో 2008లో రీ టెండర్లు నిర్వహించి ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రూ.149.60 కోట్లకు పెంచి పనులు వేగవంతం చేశారు. ఆయన మరణానికి ముందు వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. తదనంతర పాలకులు దీనిపై నిర్లక్ష్యం వహించడంతో పనులు ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లుగా మారాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆయన కుమారుడు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై దృష్టి సారించి పనులు వేగవంతం చేయించి ప్రజలకు అంకితం చేశారు. దీంతో జిల్లాలోని 3.85 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు దోహపడింది. పెన్నాడెల్టాలో 2.47 లక్షల ఎకరాలకు, కనుపూరు కెనాల్‌ పరిధిలో 63 వేల ఎకరాలు, కావలి కెనాల్‌ 75 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రానున్న రోజుల్లో కొత్త ఆయకట్టు సాగులోకి రావడానికి దోహదపడింది. ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌, కోవూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో సాగుకు మేలు చేకూరుతోంది. సోమశిల నుంచి 40 కిలో మీటర్ల దిగువ భాగంలో దీన్ని నిర్మించడం ద్వారా కుడి వైపున నెల్లూరు చెరువు, నెల్లూరు కాలువ, కనుపూరు కాలువ, కనిగిరి ప్రధాన కాలువ, దువ్వూరు కాలువ, కావలి కాలువ పరిధిలోని 3.85 లక్షల ఎకరాల సాగుకు ఇబ్బంది లేకుండా నీటి విడుదల జరుగుతోంది.

2008లో పెన్నాబ్యారేజ్‌ను రూ.126 కోట్ల వ్యయంతో నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. 0.55 టీఎంసీ నీటి సామర్థ్యంతో తలపెట్టిన పెన్నా బ్యారేజీ తదనంతరం రీ టెండర్ల ద్వారా రూ.149.39 కోట్లకు చేరింది. దివంగత మహానేత హయాంలో పరుగులు తీసిన అభివృద్ధి మళ్లీ ఆయన తనయుడు దృష్టి సారించి పూర్తి చేశారు. 57 గేట్లతో 637 మీటర్ల పొడవుతో 10.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా బ్యారేజ్‌ని నిర్మించారు. నెల్లూరు బ్యారేజ్‌ నిర్మాణంతో 5 మండలాల్లోని 72 గ్రామాల పరిధిలో 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. సర్వేపల్లి కాలువ, జాఫర్‌ సాహెబ్‌ కాలువల పరిధిలోని ఈ ఆయకట్టు పూర్తిగా నీరు అందుతోంది. నెల్లూరు నగర తాగునీటి అవసరాలు తీరుతాయి. నెల్లూరు–కోవూరు మధ్య దూరం తగ్గింది.

జిల్లాకు జలసిరులు

అందించిన జలయాజ్ఞికుడు

కృష్ణపట్నం పోర్టుతో భవిష్యత్‌ను

కాంక్షించిన స్వాప్నికుడు

విద్యుదుత్పత్తి కేంద్రాలతో వెలుగులు

నింపిన వెన్నెల రేడు

శ్రీసిటీ, మాంబట్టు, మేనకూరు

పారిశ్రామికవాడలతో అభివృద్ధికి

బీజాలు వేసిన పాలికుడు

లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి

కల్పించిన వల్లభుడు

సింహపురి అభివృద్ధిలో రాజన్న ముద్ర

నేడు మహానేత వైఎస్సార్‌ వర్ధంతి

పెన్నా బ్యారేజ్‌తో.. 1
1/2

పెన్నా బ్యారేజ్‌తో..

పెన్నా బ్యారేజ్‌తో.. 2
2/2

పెన్నా బ్యారేజ్‌తో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement