
వినాయక గ్రామోత్సవంలో ఉద్రిక్తత
● డీజేను అడ్డుకున్న పోలీసులు
● రోడ్డుకు అడ్డంగా ఉత్సవ వాహనం
● పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు
ఇందుకూరుపేట: మండలంలోని గంగపట్నం మజరా టీవీకండ్రిగలో వినాయక గ్రామోత్సవంలో డీజే సౌండ్ సిస్టంకు అనుమతుల్లేవని పోలీసులు ఆదివారం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిమజ్జనంలో భాగంగా ముందుగా గ్రామంలో ఊరేగింపు ప్రారంభించారు. డీజే ఏర్పాటు చేసి డ్యాన్స్‌లు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సమయంలో డీజేకు అనుమతి లేదని, స్థానికుల నుంచి ఫిర్యాదు అందిందంటూ ఎస్సై నాగార్జునరెడ్డి సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. అన్ని చోట్లా ఉత్సవాల్లో డీజే పెట్టారని, మా గ్రామంలో ఎటువంటి సమస్య లేకుండా ప్రశాంతంగా ఉత్సవం జరుగుతుంటే ఎందుకు అడ్డుకున్నారని గ్రామస్తులు పోలీసులను నిలదీశారు. ఫిర్యాదు చేశారో చెప్పాలని కోరారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
మహిళల నినాదాలు
పోలీసుల తీరుపై ఆగ్రహించిన ప్రజలు డీజే లేనిదే ఉత్సవం జరగదని భీష్మించారు. ఉత్సవ వాహనాన్ని రోడ్డుకు అడ్డుగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ మహిళలు నినాదాలు చేశారు. నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించినా లెక్కచేయని గ్రామస్తులు తమ నిరసనను అలాగే కొనసాగించారు. పలువురు నాయకులు వచ్చి చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.

వినాయక గ్రామోత్సవంలో ఉద్రిక్తత