
దైవ, దేశభక్తి సమ్మేళనమే గణేష్ ఉత్సవాలు
● మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నెల్లూరు(బృందావనం): దైవభక్తి, దేశభక్తి సమ్మేళనమే గణేష్ ఉత్సవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నిమజ్జనోత్సవం పురస్కరించుకుని స్వర్ణాల చెరువు వద్ద ఆదివారం గణేష్‌ఘాట్ గణపతి విగ్రహానికి పూజలు చేసి ఆవిష్కరించారు. తొలుత శ్రీస్వర్ణ లింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకుని పూజలు చేశారు. ప్రజల్లో ఐక్యత పెంపొందించేందుకు, దేశభక్తిని కలిగించేందుకు, సంస్కృతి, సంప్రదాయాలను చాటేందుకు బాలగంగాధర్ తిలక్ సామూహిక గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన ఆశయాలను అందరూ అనుసరించాలన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల పండగ సందర్భంగా దేశభక్తి, ధర్మానురక్తి ప్రజలందరి ఆకాంక్షంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, బీజేపీ నేతలు పి.సురేందర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, ఇంకా బయ్యా వాసు, పిట్టి సత్యనాగేశ్వరరావు, శ్రీకాంత్, భాస్కరరెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.