
మృత్యు తీగలు
● విద్యుదాఘాతానికి గురై
వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి
● విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమని
ఆరోపణలు
ఉదయగిరి: ఉదయగిరి పట్టణంలోని కంసాలవీధిలో ఐదో తరగతి చదువుతున్న షేక్ సమీర్ (10) అనే చిన్నారి విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కంసాలివీధిలో విద్యుత్ స్తంభం నుంచి గృహ వినియోగం కోసం సర్వీస్ వైర్ లాగి ఉన్నారు. స్తంభం నుంచి ఇంటి వరకు దూరం ఉన్నందున స్థానికులు ఇనుప పైపు ఏర్పాటు చేసుకుని అందుకు సర్వీసు తీగలు లాగి కట్టారు. ఆ పైపునకు విద్యుత్ సరఫరా అయ్యింది. ఆ వైపు వెళ్తున్న సమీర్ దానిని పట్టుకోవడంతో షాక్‌కు గురయ్యాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బిడ్డ మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇనుప పైపునకు విద్యుత్ సరఫరా అవుతున్న విషయం తెలిపినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ తీగలు యమపాశాలుగా మారాయి. వేర్వేరు మండలాల్లో ఇద్దరు షాక్‌కు గురై తనువు చాలించారు.
మృతుల్లో పదేళ్ల చిన్నారి ఉన్నారు.