
ముగిసిన తెలుగు భాషోత్సవాలు
నెల్లూరు(బృందావనం): గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని నెల్లూరు పురమందిరంలో సేవ తెలుగు భాష, సాహితి, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మూడురోజులుగా జరుగుతున్న తెలుగు భాషోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం ‘తెలుగు సాహిత్య విమర్శ’పై నిర్వహించిన సదస్సు నూతన ఆలోచనలకు నాందిపలికింది. దీనికి ప్రముఖ కవి కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రసిద్ధ విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విమర్శ రాయడం కష్టతరమైన బాధ్యతగా పేర్కొన్నారు. కీలకోపన్యాసకులు మేడిపల్లి రవికుమార్ మాట్లాడుతూ నేటి విమర్శపై, పరిశోధనలపై అప్రకటిత ఆంక్షలున్నాయంటూ వివరించారు. ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు, ఆచార్య సీహెచ్ సుశీలమ్మ, ఉన్నం జ్యోతివాసు, డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, డాక్టర్ కవితశ్రీ తదితరులు తమ భావాలను కూలంకషంగా వ్యక్తీకరించారు. వేంకటేశ్వరరెడ్డి రచించిన మూడు గ్రంథాలను ఆవిష్కరించారు. నెల్లూరు కవి గుడ్లదొన సాయిచంద్రశేఖర్ తొలి కవితా సంపుటి ‘నిశ్శబ్ద మాధుర్యం’ను చంద్రశేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆ సంస్థ అధ్యక్షుడు కంచర్ల సుబ్బానాయుడు సాహితీవేత్తలను గౌరవ పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో ఆచార్య కొలకలూరి ఇనాక్, నాగసూరి వేణుగోపాల్, గారపాటి ఉమామహేశ్వరరావు, చలంచర్ల భాస్కరరెడ్డి, డాక్టర్ నాళేశ్వర శంకరం, కుసుమ కుమారి, కె.శోభ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం, కథ, నవల, నాటకం, సినీ సాహిత్య సదస్సు, రాత్రి సమాపనోత్సవం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు, రచయితలు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు.