
సమగ్ర సోమశిల సాకారం
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లా రైతుల సమగ్ర సోమశిల కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏటా 35 నుంచి 48 టీఎంసీలకే పరిమితమైన సోమశిలను జలయజ్ఞం ద్వారా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ముంపు పరిహారంలో నెలకొన్న జాప్యం, అటవీశాఖ అనుమతులు లభించని పరిస్థితిపై దృష్టి సారించారు. ముంపు ప్రాంత బాధితుల పరిహారాన్ని వెంటనే విడుదల చేయించారు. వైఎస్సార్ పాలన ఏడాదిలోపే 48 టీఎంసీల నీటి నిల్వను 51 టీఎంసీల వరకు నీటి నిల్వ సామర్థ్యం పెంచారు. 2007–08లో 317 కాంటూరు వరకు నింపి పూర్తిస్థాయిలో 51 టీఎంసీ నిల్వ ఉంచేలా చేశారు. అనంతరం 326 కాంటూరు వరకు నీటి నిల్వ సామర్థాన్ని పెంచేందుకు వైఎస్సార్ జిల్లా ఎగువరాచపల్లి అడ్డంకిగా ఉండేది. ఈ గ్రామానికి యుద్ధప్రాతిపదికన పరిహారం చెల్లించి ఖాళీ చేయించి నీటి సామర్థ్యం పెంచేలా చేశారు. జలాశయంలో నీటి సామర్థ్యాన్ని 72 టీఎంసీల వరకు పెంచేలా చేసి సింహపురి రైతుల్లో హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ప్రధానంగా సమగ్ర సోమశిలలో భాగంగా 104 కిలో మీటర్ల పొడవునా ఉత్తర కాలువను సోమశిల నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు వరకు అభివృద్ధి చేసి నీటి అవుట్ ఫ్లో సామర్థ్యాన్ని పెంచారు.