
భూములను మింగేస్తున్న ‘పోరంబోకు’లు
కలువాయి (సైదాపురం): అధికారమే అండగా కూటమి పార్టీల నేతలు చెలరేగిపోతున్నారు. కంటికి కనిపించిన ఇసుకనూ, మట్టినీ వదల్లేదు. ఇప్పుడు చెరువులు, అటవీ, పోరంబోకు భూములనూ కబ్జా చేస్తున్నారు. తాజాగా కలువాయి మండలం 598 సర్వే నంబర్‌లోని కుల్లూరు ఎర్ర చెరువును ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూములను సైతం దాదాపు 20 ఎకరాలను మంగళవారం దర్జాగా కబ్జా చేసి చదును చేశారు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో స్ధానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుని గ్రామ రెవెన్యూ అధికారి సహకారంతో దర్జాగా ఎర్ర చెరువు పోరంబోకు, రిజర్వ్ ఫారెస్టు భూములను చదును చేసి చుట్టూ కంచె కూడా వేశారు. ఈ విషయంపై గ్రామస్తులు పిఱ్యాదు చేయడంతో ఇన్‌చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి అక్కడ జరిగే పనులను అడ్డుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఫారెస్ట్ అధికారులకు ఇన్‌చార్జి తహసీల్దార్ ఫోన్ చేయగా వారు స్విచ్ఛాఫ్ చేసుకుని ఉండడం గమనార్హం. దీన్ని బట్టి అటవీ శాఖ అధికారుల హస్తం కూడా గ్రామస్తులు భావిస్తున్నారు. మూడు రోజుల నుంచి ఎవరికీ తెలియకుండా బ్రాహ్మణపల్లి, వెంకటరెడ్డిపల్లి రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌లో 20 ఎకరాల భూమిని చదువు చేయడాన్ని చూసి రెవెన్యూ అధికారులు అవాక్కయారు. గ్రామ రెవెన్యూ అధికారి గ్రామంలోకి వచ్చినప్పటి నుంచి ఇటీవల కుల్లూరు గ్రామంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయిని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల ఎర్ర చెరువు అలుగు ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలకు ఆత్మకూరు ఆర్డీఓ పావని స్పందించి పనులు వెంటనే ఆపాలని అప్పటి తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మళ్లీ కూటమి నాయకులు భూములు చదును చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందరికీ తెలిసే ప్రదేశం కాదు కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా మూడు రోజుల నుంచి పనులు చకచకా చేసేస్తున్నారు. రిజర్వ్ ఫారెస్టు చెరువు పోరంబోకు పొలాల్లో ఆక్రమణలు చేపడితే చర్యలు తప్పవని ఇన్‌చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లు వారిని హెచ్చరించారు.

భూములను మింగేస్తున్న ‘పోరంబోకు’లు