
మత్తు పదార్థాల విక్రయాలపై నియంత్రణేదీ?
రెడ్‌బుక్ రాజ్యాంగం.. అక్రమ కేసులు, అరెస్ట్‌లు
కూటమి అధికారంలోకి వచ్చాక పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రతిపక్ష నేతలపై రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో నిమగ్నం కావడంతో నేరస్తులు చెలరేగిపోతున్నారు. గంజాయి, మత్తు మాదక ద్రవ్యాలు, మద్యం విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో నేరస్తులను గుర్తించి, వారిపై నిఘా ఉండడంతోపాటు వారి దినచర్యలను పర్యవేక్షించి కటకటాలపాల్జేయాల్సిన పోలీస్ యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్‌లు, కస్టడీలు, విచారణలతో కాలక్షేపం చేస్తోంది.
● ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో నెల్లూరుకు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ ఇద్దరు యువకులు ఎవరిని హత్య చేస్తున్నారో కూడా వారికే తెలియదు. కేవలం రూ.30 వేలిచ్చి హత్య చేసేందుకు కిరాయి ముఠా పిలిపించుకుని దారుణ హత్యలో పాల్గొనేలా చేసింది. వీరు కేవలం గంజాయి మత్తు కోసం ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
● హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ హత్యకు గురయ్యాడు. గత నెల 15న మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లి ఇంటికి వస్తుండగా కిరాయి హంతకులు కళ్లల్లో కారం కొట్టి తుపాకీతో కాల్చి చంపారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దారుణ హత్యలో నెల్లూరు జిల్లాకు చెందిన అర్జున్, రాంబాబు సుపారీ తీసుకుని భాగస్వామ్యం అయ్యారు. అక్కడి పోలీసులు నిందితులను కావలి సమీపంలోని ముసునూరు టోల్‌గేట్ వద్ద అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
● గతంలో హైదరా బాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం సమాచారంపై పోలీసులు దాడులు చేస్తే నెల్లూరుకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుమారుడు పట్టుబడ్డాడు. అతనే ఆర్గనైజర్‌గా తేల్చారు. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి కీలక అనుచరుడు కావడంతో రంగంలోకి దిగి కేసు మాఫీ కోసం అష్టకష్టాలు పడ్డారు.
‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మత్తు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. అక్రమార్కుల బెండు తీసి కటకటాల వెనక్కి నెట్టింది. జిల్లాలో నేరాలు గణనీయంగా తగ్గాయి. ప్రజలు హాయిగా జీవించారు.’
‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. జిల్లాలో క్రమేపి శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, బెల్టుషాపులు, మాదక ద్రవ్యాల సరఫరా పెరిగింది. నేరాలు, మారణహోమాలు మితిమీరాయి.’
సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లా కేంద్రం నుంచి మారుమూల ప్రాంతాల వరకు నేరప్రవృత్తి పేట్రేగి పోతోంది. ప్రధానంగా నెల్లూరు నగరంలో నేరమేథం వేళ్లూనుకుంటోంది. గంజాయి, మత్తు ఉత్ప్రేరకాలకు బానిసలైన యువత విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతోంది. వ్యసనాలను తీర్చుకునేందుకు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఒంటరిగా వెళుతున్న వారిని కత్తులతో బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఎదురు తిరిగిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ పరిణామాలతో ఇళ్లు విడిచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడుల్లో అధిక శాతం గంజాయి మత్తులోనే జరుగుతున్నాయని పోలీసుల విచారణలో తేలింది. నెల్లూరు నగరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయి. గంజాయి దొరకని ప్రాంతం లేదు. యువత, విద్యార్థులు లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నారు. తొలుత ఫ్యాషన్‌కు అలవాటు పడిన వారు క్రమేపి బానిసలై మత్తు లేకపోతే బతకలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు.
శివారు ప్రాంతాల్లోనే గంజాయి విక్రయాలు
నెల్లూరు నగరంలోని కపాడిపాళెం, పొర్లుకట్ట, భగత్‌సింగ్‌కాలనీ, పాతచెక్‌పోస్టు, ఎన్‌టీఆర్‌నగర్, హరనాథపురం ఎక్స్‌టెన్షన్ ఏరియా, వెంగళ్‌రావునగర్, కొత్తూరు, పుత్తాఎస్టేట్, రాజీవ్‌గృహకల్ప సమీపం, విజయమహల్‌గేటు తదితర ప్రాంతాల్లో గంజాయి మత్తులో యువత నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండగా మరి కొందరు భయంతో పోలీసుస్టేషన్ల వరకు వెళ్లడం లేదు. ఇదే అదనుగా భావించిన కొందరు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు.
లాఠీ దెబ్బలను మాన్పుతున్న మత్తు ఇంజెక్షన్లు
చాలా మంది యువకులు గంజాయి ఇచ్చే మత్తు చాలక, కేన్సర్ రోగులకు చివరి దశలో ఇచ్చే శక్తి వంతమైన మార్ఫిన్, పెథిడిన్, ఫోర్ట్విన్, ఫినార్గోన్ వంటి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు వేసుకొంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. సమాచారం. వీటిని వాడడం వల్ల శరీరం మొత్తం మత్తు ఆవహించి, మొద్దుబారిపోతోంది. ఈ ఇంజెక్షన్ వేసుకున్న వారికి నొప్పి కూడా తెలియదంట. పోలీసులు లారీతో చావబాదినా ఈగ వాలినట్లు కూడా ఉండదని, దీంతో పోలీసులు ఎన్నిసార్లు లాఠీలు ఝుళిపించినా.. నిజాలు బయటకు రావడం లేదని తెలుస్తోంది.
.. అడ్డాగా నెల్లూరు
కళ్లల్లో మత్తు.. చేతుల్లో కత్తులు, తుపాకీలు.. మాటా మాటకే కత్తులు ఝళిపిస్తున్నాయి. సుపారీలతో తుపాకీలు పేలుతున్నాయి. పాత కక్షలు, ఆస్తి తగాదాలు, మద్యం మత్తులో విభేదాలు నరమేధానికి ప్రేరేపిస్తున్నాయి. చిన్న గొడవలు రక్తపాతాన్ని సృష్టిస్తున్నాయి. రాత్రి పూటే కాదు పగలు కూడా రహదారుల్లో తిరగాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. ఎక్కడ కత్తి కరుస్తుందో అనే ఆందోళన కనబడుతోంది. సుపారీ నేరాలు నెల్లూరు నుంచి అంతర్ జిల్లాలు, అంతర్రాష్ట్ర స్థాయి వరకు ఎగబాకాయి. ఎక్కడ నేరం జరిగినా.. నేరస్తుల మూలాలు నెల్లూరులోనే చూపిస్తున్నాయి. నేరాలను నియంత్రించాల్సిన పోలీసులు ఈ పనికి స్వస్తి పలికి.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రత్యర్థి పార్టీ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్‌ల్లో తలమునకలు అవుతున్నారు. గడిచిన ఏడాది కాలంగా జిల్లాలో జరిగిన మారణహోమం ఇందుకు దర్పణం.
ఏడాది కాలంలో జిల్లాలో ఘటనలు మచ్చుకు కొన్ని..
నెల్లూరు ప్రగతినగర్‌లో గంజాయి, మద్యం మత్తులో కొందరు యువకులు కారు డ్రైవర్‌ను అతి కిరాతకంగా హత్య చేశారు.
ముత్తుకూరు బస్టాండ్ వద్ద గంజాయి మత్తులో ఇద్దరు యువకులు ఓ మహిళను చంపుతామని బెదిరించి రెండు సెల్‌ఫోన్లను దోచుకెళ్లారు.
తల్పగిరికాలనీ వద్ద నాగేంద్రను కత్తులతో చంపుతామని బెదిరించి అతని ఫోన్‌పే నుంచి రూ.5 వేల నగదును దుండగులు ట్రాన్సఫర్ చేయించుకున్నారు.
టిఫిన్ విషయంలో మాటామాటా పెరిగి టెంపో ట్రావెల్స్ నిర్వాహకుడు అల్లాభక్షును మత్తులో ఉన్న రంగనాయకులపేటకు చెందిన షేక్ ఇషాక్ హత్య చేశాడు.
మద్యం మత్తులో మాటామాటా పెరగడంతో సుల్తాన్ అనే వ్యక్తిని ఇద్దరు హత్య చేశారు.
గంజాయి మత్తులో ఉన్న కొందరు నెల్లూరు సుజాతమ్మకాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.
మత్తులో ఉన్న ముగ్గురు యువకులు రైల్వేస్టేషన్ వద్ద బైక్‌పై వెళుతున్న బ్యాంకు ఉద్యోగిని చంపుతామని కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నారు.
ఇటీవల నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి సెంటర్‌లో ఓ యువకుడు హోటల్ కెళ్లి టిఫన్ ఆర్డర్ ఇచ్చాడు. తనకంటే వెనకున్న ఓ వ్యక్తి ఆర్డర్ ఇచ్చారు. ముందుగా తాను టిఫిన్ ఆర్డర్ ఇచ్చినా వెనకొచ్చిన వ్యక్తికి ఇచ్చాడని కారణంతో ఇద్దరు మధ్య జరిగిన చిన్న వివాదంతో దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.
నెల్లూరు రామలింగాపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో రౌడీషీటర్ కత్తి రవి (32)ని దారుణంగా హత్య చేసిన నిందితులు.
ఆర్థిక విభేదాల నేపథ్యంలో ముత్యాలపాళెంలో ఎం.పౌల్ (35)ను దారుణంగా హత్య చేసిన నిందితులు.
కొండాపురం మండలంలో తిరుపాల్ (55) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసి 25 మేకలను అపహరించుకెళ్లారు.
ఉదయగిరిలో జనం చూస్తుండగానే వరుసకు బావను బావమరుదులే హత్య చేశారు. ఆస్తి తగాదాలే కారణం.
కలువాయి మండలంలోని పల్లంకొండలో గోపి అనే యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు.
కొడవలూరు మండలం టపాతోపు వద్ద హిజ్రా నాయకురాలు హాసీనిని ప్రత్యర్థులు దారుణంగా చంపారు
కొడవలూరు మండలం మిక్కిలింపేట వద్ద బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన స్టీల్‌వ్యాపారి రమేష్ హత్యకు గురైయ్యాడు.
నెల్లూరు ఉడ్‌హౌస్ సంఘంలో సస్పెక్ట్ షీటర్ కళ్యాణ్‌ను పాతకక్షల నేపథ్యంలో హత్య చేసిన దుండగులు.
ఇందిరాగాంధీనగర్‌లో రౌడీషీటర్ సుజనకృష్ణ అలియాస్ చింటూను స్నేహితులే కిరాతకంగా హత్య చేశారు.
తాజాగా జాకీర్ హుస్సేన్‌నగర్ న్యూకాలనీలో మద్యం మత్తులో దూషించాడని భర్త శ్రీనివాసకుమార్‌ను హత్య చేసిన భార్య.
అంతర్రాష్ట్ర స్థాయిలో
నేరాల మూలాలు ఇక్కడే
గంజాయి, మద్యం, మత్తు ఇంజెక్షన్లతో విచక్షణ కోల్పోతున్న యువకులు
సుపారీ హత్యలకు తెగబడుతున్న యువత
గంజాయి బ్యాచ్‌కు అధికార పార్టీ నేతల అండదండలు
హంతకులను వెనకేసుకొస్తుండడంతో పోలీసుల మౌనం
ఆరు నెలల్లో ఒక్క నెల్లూరులోనే
20 పైగా హత్యలు
అక్రమ కేసులు, అరెస్ట్‌లతో
నేర నియంత్రణను మరిచిన ఖాకీలు
సింహపురిలో తిరగాలంటే
భయం.. భయం
ప్రతి నెలా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమన్వయ సమావేశంలో కలెక్టర్, ఎస్పీలు అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూనే ఉన్నారు. వారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు మొక్కుబడి చర్యలకే పరిమితమవుతున్నారు. అడపాదడపా దాడులతో సరిపెట్టుకుంటున్నారు. మత్తు, మాదక ద్రవ్యాల నిర్మూనలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈగల్ ఊసే జిల్లాలో లేకుండాపోయింది. అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రజల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని, బీట్‌లు పెంచామని, డ్రోన్లతో నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నప్పటికీ ప్రజలకు మాత్రం తగినంత భరోసా దొరకడం లేదు.

మత్తు పదార్థాల విక్రయాలపై నియంత్రణేదీ?

మత్తు పదార్థాల విక్రయాలపై నియంత్రణేదీ?