
జిల్లాలో ఇలా..
● రెంట్ రూపంలో ఏటా కోట్లాది రూపాయలు
అద్దె భవనాలు.. అరకొర వసతుల నడుమ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు కునారిల్లుతున్నాయి. భవనాలకు రెంట్ రూపంలో ఏటా కోట్లాది రూపాయలను చెల్లిస్తున్నా, వసతులు మాత్రం దుర్భరంగా మారాయి. ఆట బొమ్మల కొరతతో చిన్నారులు పాత వాటితోనే కాలక్షేపం చేయాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
● ఆట బొమ్మల్లేక పాత వాటితోనే కాలక్షేపం
● అమలుకు నోచుకోని మెనూ
● అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇదీ దుస్థితి
● పట్టించుకోని కూటమి ప్రభుత్వం
నెల్లూరు (పొగతోట): జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు దుర్భర స్థితికి చేరుకుంటున్నాయి. కేంద్రాల్లో అభివృద్ధి, మౌలిక వసతులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. వీటిని అధునాతనంగా తీర్చిదిద్దుతామని పాలకులు చెప్పినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ మాత్రం మారడంలేదు. చాలా చోట్ల సొంత గూడు లేకపోవడంతో, సమస్య ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ తీరు..
జిల్లాలో 2934 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, ఇందులో 732 అద్దె భవనాల్లో కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 65,215.. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 52,635.. గర్భిణులు 12,843.. బాలింతలు 11,461 మంది ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు ఆట వస్తువులతో ఉత్తేజపరుస్తుంటారు. అయితే సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఇవి నేటికీ సరఫరా కాలేదు. అదే గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పరికరాలను క్రమం తప్పకుండా అందజేసేవారు.
నాసిరక బియ్యం సరఫరా
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేస్తారు. అయితే సన్న బియ్యానికి బదులు ముతక బియ్యాన్ని సరఫరా చేశారని తెలుస్తోంది. మరోవైపు గర్భిణులు, బాలింతలకు నెలకు మూడు కిలోల చొప్పున బియ్యం.. కిలో కందిపప్పు, అర లీటర్ నూనె,, ఐదు లీటర్ల పాలు.. 25 కోడిగుడ్లు.. కిలో అటుకులు.. రెండు కిలోల రాగిపిండి.. 250 గ్రాముల డ్రై ఫ్రూట్స్.. తదితరాలను ఇవ్వాల్సి ఉన్నా, పూర్తిస్థాయిలో అందజేయడంలేదు.
మెనూ అమలూ అంతంతే..
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆహారాన్ని సోమవారం నుంచి శనివారం వరకు అందించాల్సి ఉంది. అయితే మెనూ అమలు అంతంతమాత్రంగా ఉందనే ఫిర్యాదులొస్తున్నాయి. ఆ సమయంలో అధికారులు తనిఖీలకెళ్తే, ముందుగా సమాచారం తెలుసుకొని నాణ్యమైన వాటిని పంపిణీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. వీటి బలోపేతానికి గత ప్రభుత్వ హయాంలో పెద్ద పీట వేసినా, నేడంతా అస్తవ్యస్తంగా మారింది.
అద్దెల రూపంలో నెలకు రూ.35 లక్షలు
జిల్లాలోని 732 అంగన్‌వాడీ కేంద్రాలకు సుమారు రూ.35 లక్షలకుపైగా అద్దెను ప్రతి నెలా చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.4.2 కోట్లను సమర్పిస్తున్నారు. శాశ్వత భవనాల నిర్మాణాల దిశగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంపడంలో విఫలమవుతున్నారు. భవన నిర్మాణాలకు భూముల్లేవనే సాకు చూపి ఏటా అద్దె రూపంలో నిధులను భారీగా వెచ్చిస్తున్నారు.
నెరవేరని సంకల్పం
అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలకు గానూ జెడ్పీ నుంచి నిధులను చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ విడుదల చేశారు. అయితే వీటిని సద్వినియోగం చేసుకొని, నిర్మాణాలను చేపట్టడంలో ఐసీడీఎస్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇదే అంశమై జెడ్పీ సర్వసభ్య, స్థాయీ సంఘ సమావేశాల్లో తరచూ ప్రస్తావిస్తున్నా, ఎలాంటి పురోగతి కానరావడంలేదు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఐసీడీఎస్ ప్రాజెక్టులు – 7
కేంద్రాలు – 2934
అద్దె భవనాల్లో ఉండేవి – 732
చెల్లించే మొత్తం రూ.ఆరు వేలు (పట్టణాల్లో)
రూ.రెండు వేలు (పల్లెల్లో)
ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు – 65,215
మూడు నుంచి ఆరేళ్లలోపు వారు – 52,635
గర్భిణులు – 12,843
బాలింతలు – 11,461
ప్రతిపాదనలను పంపాం
అంగన్‌వాడీ కేంద్రాల్లో పాత ఆట వస్తువులే ఉన్నాయి. వీటితోనే సరిపెడుతున్నాం. కొత్త వాటి కోసం ప్రతిపాదనలను పంపాం. త్వరలో వచ్చే అవకాశముంది. అద్దె భవనాలకు సంబంధించి ఏటా ఇదే పరిస్థితి నెలకొంది. స్థలాల్లేని కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. – హేనాసుజన్, ఐసీడీఎస్ పీడీ

జిల్లాలో ఇలా..

జిల్లాలో ఇలా..

జిల్లాలో ఇలా..