
నేడు పోలీస్ విచారణకు మాజీ మంత్రి అనిల్
కోవూరు: పోలీసుల విచారణకు మాజీ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ సోమవారం హాజరుకానున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఆయనపై విచారణ కొనసాగుతోంది. వాస్తవానికి కోవూరు సర్కిల్ కార్యాలయంలో విచారణకు గత నెల 26న హాజరుకావాలని నోటీసులను జారీ చేయగా, వ్యక్తిగత కారణాలతో ఆ రోజు రాలేనని ఆయన తెలియజేశారు. దీంతో గత నెల 30న ఉదయం పదికి విచారణకు రావాలని మరోసారి నోటీసులిచ్చారు. అయితే మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా బందోబస్తు విధులను నిర్వర్తించాల్సి ఉండటంతో, ప్రక్రియను పోలీసులే వాయిదా వేశారు. తాజాగా విచారణకు సోమవారం హాజరుకావా లని నోటీసును ఇవ్వడంతో ఆయన రానున్నారు.
యథేచ్ఛగా
మట్టి అక్రమ రవాణా
సోమశిల: చేజర్ల మండలంలోని తూర్పుకంభంపాడులో గల కుంట నుంచి మట్టిని రాత్రి వేళ అక్రమంగా తరలిస్తున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, పచ్చమీడియాకు చెందిన ఓ విలేకరి సహకారంతో జేసీబీని ఏర్పాటు చేసి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా వందలాది ట్రిప్పుల్లో యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కుంటలో భారీ గుంతలు తీసి నాశనం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. కాగా ఈ విషయమై తహసీల్దార్ మురళిని సంప్రదించగా, విచారణ జరిపి చర్యలు చేపడతామని బదులిచ్చారు.
తొలి రోజు విచారణ పూర్తి
నెల్లూరు (లీగల్): సీఐడీ అధికారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తొలి రోజు విచారణ పూర్తయింది. ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేశారని వెంకటాచలం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జిల్లా కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కాకాణిని కోర్టు అనుమతితో సీఐడీ పోలీసులు రెండు రోజుల విచారణ నిమిత్తం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి ఆదివారం ఉదయం 11.30కు తరలించారు. న్యాయవాది సిద్ధన సుబ్బారెడ్డి సమక్షంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, డీఎస్పీ 26 ప్రశ్నలడిగారు. మధ్యవర్తులు.. వీఆర్వోలు సూర్యకుమార్, సాంబశివ సమక్షంలో విచారణ జరిగింది. అనంతరం సాయంత్రం 4.30కు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.
కండలేరు వరద కాలువకు
నీటి విడుదల
సోమశిల: సోమశిల జలాశయం నుంచి కండలేరు వరద కాలువకు నీటిని ఆదివారం విడుదల చేశారు. తొలుత గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి చీర, సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ బసిరెడ్డి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. ఈ ఏడాది ఊహించిన దాని కంటే ముందే కృష్ణా జలాలొస్తున్నాయని చెప్పారు. కండలేరు వరద కాలువకు మూడు వేల క్యూసెక్కులను విడుదల చేశామని, క్రమేణా దీన్ని ఆరు వేలకు పెంచుతామని వివరించారు. ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి, ఈఈ శ్రీనివాసులు, కలువాయి ఈఈ మహేష్, తెలుగుగంగ ఈఈ అనిల్‌కుమార్‌రెడ్డి, డీఈఈ రవీంద్రప్రసాద్, జేఈలు పాపిశెట్టి నిఖిల్, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇస్కాన్ మందిరంలో
సాంస్కృతిక పోటీలు
నెల్లూరు(బృందావనం): కృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని మినీబైపాస్‌రోడ్డులోని ఇస్కాన్ మందిరంలో విద్యార్థులకు సాంస్కృతిక పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ నెల్లూరు అధ్యక్షుడు డాక్టర్ శుఖదేవస్వామి మాట్లాడారు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక చింతన, సనాతన సంస్కృతి, సంప్రదాయాలను వివరించాలనే సంకల్పంతో ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నా మని వివరించారు. నగర పరిధిలోని వివిధ విద్యాసంస్థల నుంచి 300 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. రాధాకృష్ణులు, బలరాముడు, గోపికల వేషధారణల్లో బాలబాలికలు సందడి చేశారు. డాక్టర్ పల్లంరెడ్డి యశోధర, ఎస్పీ సతీమణి ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

నేడు పోలీస్ విచారణకు మాజీ మంత్రి అనిల్

నేడు పోలీస్ విచారణకు మాజీ మంత్రి అనిల్