
5 నెలలు.. 11 కేసులు
నెల్లూరు(క్రైమ్): గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే పోలీసులు చర్యలు తీసుకున్నారు. రైళ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమార్కులను అరెస్ట్ చేసి సరుకును స్వాధీనం చేసుకుంటున్నారు. ఒడిశా, ఏఓబీ సరిహద్దు ప్రాంతాల నుంచి జిల్లా మీదుగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాన గంజాయి పెద్దఎత్తున తరలివెళ్తోంది. అక్రమార్కులు ఒడిశా, ఏఓబీ ప్రాంతాల్లో కేజీ రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి తమ ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాలకు..
ఒడిశా, విశాఖ వైపు నుంచి తిరుపతి, చైన్నె, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో అక్రమ రవాణా సాగుతోందని నెల్లూరు రైల్వే పోలీసులు గుర్తించారు. డీఎస్పీ జి.మురళీధర్ పర్యవేక్షణలో సీఐ ఎ.సుధాకర్ ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రైళ్లు, జిల్లాలోని కావలి, నెల్లూరు, గూడూరు రైల్వేస్టేషన్‌లలో తనిఖీలు ముమ్మరం చేశారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ఎక్కడ? ఎవరి వద్ద కొనుగోలు చేశారు? ఎవరికి సరఫరా చేస్తున్నారు? ఏ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు? తదితర వివరాలను సేకరించి అరెస్ట్‌లు చేస్తున్నారు. సరఫరాదారులపై సైతం కేసులు నమోదు చేస్తున్నారు.
కేసులిలా..
గడిచిన ఐదునెలల్లో గంజాయి అక్రమ రవాణాపై కావలిలో రెండు, నెల్లూరులో ఆరు, గూడూరులో మూడు కేసులు నమోదు చేశారు. మొత్తంగా 11 కేసులు నమోదు చేసి 96 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 14 మంది నిందితులను అరెస్ట్‌చేశారు. నిందితలందరూ దాదాపు ఇతర రాష్ట్రాలకు చెందినవారే. అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేంత వరకూ తనిఖీలు కొనసాగిస్తామని సీఐ ఎ.సుధాకర్ తెలిపారు. అదేక్రమంలో రైళ్లలో మత్తు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972, లేదా 139 నంబర్‌కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సూచిస్తున్నారు.
రైళ్లలో పెద్ద ఎత్తున గంజాయి
అక్రమ రవాణా
తనిఖీలు చేపట్టిన రైల్వే పోలీసులు
96 కేజీల గంజాయి స్వాధీనం

5 నెలలు.. 11 కేసులు