నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడులు చేశారు. పోలీసుల వాహనాన్ని చూసి ఇద్దరు నిందితులు పరారవగా ఇద్దరు చిక్కారు. శుక్రవారం చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు నిందితుల వివరాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన నాగప్పన్ మణికంఠ, ఓ బాలుడు మద్యం, గంజాయికి బానిసై నిత్యం మత్తులో తేలుతున్నారు. వారి వ్యసనాలను తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే విక్రయాలు చేస్తున్న చైన్నె సెంట్రల్‌కు చెందిన సూర్య, ఎలన్ జరియన్‌ను కలిశారు. అందరూ కలిసి ఈనెల 7వ తేదీ నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో కావలికి చేరుకున్నారు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తి నుంచి రెండు కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం నలుగురూ కలిసి ఆర్టీసీ బస్సులో నెల్లూరుకు వచ్చారు. చైన్నె వెళ్లేందుకు బస్సు కోసం వేచిచూడసాగారు.
పక్కా
సమాచారంతో..
పోలీస్ వాహనాన్ని చూసి ఇద్దరి పరారీ
మరో ఇద్దరిని పట్టుకుని స్టేషన్‌కు తరలింపు
ఆర్టీసీ బస్టాండ్‌లో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్సై అయ్యప్ప తన సిబ్బందితో కలిసి బస్టాండ్‌కు చేరుకున్నారు. పోలీసుల వాహనాన్ని చూసి నిందితులు పరారవగా వెంబడించారు. నాగప్పన్ మణికంఠ, మైనర్ బాలుడు చిక్కగా మరో ఇద్దరు మాత్రం పరారయ్యారు. పట్టుబడిన నిందితుల నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మణికంఠను అరెస్ట్ చేయగా, బాలుడిని జువనైల్ హోంకు తరలించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.