
వృత్తి చేపల వేట.. ప్రవృత్తి నాటకాలు
కందుకూరు రూరల్: అవనిగడ్డ నాగేశ్వరరావు.. ఈయన వృత్తి సముద్రంలో చేపలు పట్టడం.. ప్రవృత్తి స్టేజీపై నాటకాలు ఆడటం.. నేర్పించడం. బ్రహ్మంగారి నాటకంపై ఆసక్తి పెంచుకుని సిద్ధయ్య పాత్రలో నటిస్తూ.. దర్శకుడిగా కూడా రాణిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఉలవపాడు మండలం రామాయపట్నంలో పల్లెపాళేనికి చెందిన అవనిగడ్డ వెంకటేశ్వర్లు –నాగమ్మలకు పదిమంది పిల్లలున్నారు. వీరిలో మూడో సంతానమైన నాగేశ్వరరావు ఆరో తరగతి వరకే చదివాడు. నాటకాలపై ఆసక్తి పెరగడంతో పెదగంజాంకు చెందిన ఎం.సుబ్బారెడ్డి అనే గురువు వద్ద నేర్చుకున్నారు. సుదన్వార్జున డ్రామాలో నారదుడి పాత్ర వేశాడు. అందులో నాగేశ్వరరావు ప్రతిభ చూసిన గురువు బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య పాత్రకు సిద్ధం చేశారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో సుమారు 80 ప్రదర్శనలిచ్చారు. సిద్ధయ్య పాత్ర చేస్తూనే బ్రహ్మంగారి నాటకంపై మంచి పట్టు సాధించి దానికి దర్శకుడిగా మారాడు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 గ్రూపులకు నేర్పించాడు.
ముందుండి..
నాటక ప్రదర్శనలో ఏదైనా పాత్రకు వేషధారుడు లేకపోతే నాగేశ్వరరావు పూర్తి చేసేవాడు. కుటుంబ జీవనం కోసం చేపల వేటకు వెళ్తూనే మరోవైపు నాటకాలు నేర్పిస్తున్నాడు. బ్రహ్మంగారి నాటకం గ్రూపులో సుమారు పదిహేను మంది పాత్రధారులుంటారు. వారికి పద్యాలతోపాటు, ఆటపాటలతో నటన నేర్పించాలి. ఒక్కో గ్రూపునకు 3 నుంచి 4 నెలల వరకు సమయం పడుతుంది. ఇంటి నుంచి వెళ్లాడంటే ఆరునెలలకు ఒకసారి తిరిగొస్తాడు. అదే విధంగా గ్రామంలో ఉచితంగా పంచాంగం చూసి మూహుర్తాలు చెబుతుంటాడు. కందుకూరులోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ‘తప్పిపోయిన కుమారుడు’ నాటిక పుస్తకావిష్కరణ శనివారం జరగనుంది. ఇందులో నాగేశ్వరరావును సన్మానించనున్నారు.
పౌరాణిక నాటకాలు అంతరించిపోతున్నాయి
పౌరాణిక నాటకాలు అంతరించిపోతున్నాయి. బ్రహ్మంగారి నాటకం, చెంచులక్ష్మి, చింతామణి ప్రదర్శనలు కరువయ్యాయి. టీవీలు, సెల్‌ఫోన్లతో కాలం గడిపేస్తున్నారు. నాటకాలపై ఆసక్తి ఉన్న మాలాంటి వారు నేర్పిస్తామన్నా ఆసక్తి చూపడం లేదు. ఎక్కడో కొందరు మాత్రమే నేర్చుకుంటున్నారు.
– అవనిగడ్డ నాగేశ్వరరావు
బ్రహ్మంగారి నాటకంలో
సిద్ధయ్య పాత్రలో 80 ప్రదర్శనలు
దర్శకుడిగా 25 గ్రూపులకు శిక్షణ

వృత్తి చేపల వేట.. ప్రవృత్తి నాటకాలు