
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఓ కార్యాలయంలో చోరీకి పాల్పడిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. రంగనాయకులపేట మహాలక్ష్మమ్మగుడి సమీపంలో నివాసం ఉండే పి.జిలానీబాషాకు కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు ప్రాంతానికి చెందిన పి.అష్రఫ్ ఖాన్ వరుసకు తమ్ముడు. జిలానీ నెల్లూరు రూరల్ మండలం జీవీఆర్‌ఆర్ కళాశాల సమీపంలో ఖాన్ ప్రాపర్టీస్ కార్యాలయం నిర్వహిస్తున్నాడు. కుదువలో ఉన్న తన 50 గ్రాముల బంగారు ఆభరణాలను ఈనెల ఒకటో తేదీన విడిపించాడు. ఆభరణాలతోపాటు రూ.50 వేల నగదును బ్యాగ్‌లో పెట్టి కార్యాలయంలోని కప్‌బోర్డులో ఉంచాడు. ఆ సమయంలో అష్రఫ్ ఖాన్ సైతం అతడి వెంట ఉన్నాడు. అనంతరం ఇద్ద రూ బయటకు వెళ్లిపోయారు. మరుసటి రోజు సాయంత్రం జిలానీ కార్యాలయానికి రాగా బ్యాగ్ కనిపించలేదు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగతనం చేసింది అష్రఫ్ ఖాన్, అతడికి సన్నిహితుడైన బాలు డిగా గుర్తించారు. మంగళవారం గొలగమూడి క్రాస్‌రోడ్డుకు కొద్దిదూరంలోని ఓ స్కూల్ సమీపంలో వారి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 50 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అష్రఫ్‌ను అరెస్ట్ చేయగా బాలుడిని జువనైల్ హోంకు తరలించారు. కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్, ఎస్సై నవీన్, పీఎస్సై సాయికల్యాణ్, సిబ్బందిని నగర డీఎస్పీ సింధుప్రియ అభినందించారు.