
ఆటోలో వెళ్తుండగా..
● బ్యాగ్‌లోని నగదు మాయం
నెల్లూరు(క్రైమ్): ఓ మహిళ ఆటోలో వెళ్తుండగా బ్యాగ్‌లోని నగదు మాయమైన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు హరనాథపురంలో వరలక్ష్మీదేవికి రాజరాజేశ్వరి గుడి ప్రాంతానికి చెందిన పద్మ రూ.లక్ష నగదు ఇవ్వాల్సి ఉంది. దీంతో గతనెల 21వ తేదీన ఆమె గుడివద్దకు వెళ్లగా పద్మ నగదు ఇచ్చింది. దానిని బ్యాగ్‌లో పెట్టుకుని ఆటోలో కోర్టు వద్దకు బయలుదేరింది. కొద్దిదూరం వెళ్లాక ఇద్దరు వ్యక్తులు అదే ఆటోలో ఎక్కారు. ఆమె కోర్టు వద్ద దిగి భర్తతో కలిసి ఇంటికి వెళ్లింది. భోజనం చేసిన అనంతరం బ్యాగ్‌ను తెరిచి చూడగా నగదు కనిపించలేదు. బాధితురాలు మంగళవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో తనతోపాటు ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులే నగదు మాయం చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు
చెరువులో పడి..
● వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన ఘటన నెల్లూరు బారాషహీద్ దర్గా సమీప స్వర్ణాల చెరువులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ప్రగతి నగ ర్‌కు చెందిన సుభాన్ (45) అవివాహితుడు. మటన్ అంగట్లో, కూలీ పనులు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను తరచూ ఇంటికి వచ్చేవాడు కాదు. బారాషహీద్ దర్గా పరిసరాల్లో తిరుగుతూ రాత్రివేళల్లో అక్కడే ఉండేవాడు. సోమవారం ప్రమాదవశాత్తు స్వర్ణా ల చెరువులో పడి మునిగిపోయాడు. మంగళవా రం మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమా చారం అందించారు. మృతుడి సోదరుడు జిలానీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం
ఉదయగిరి: పట్టణంలో సోమవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. అగ్రహారం వీధికి చెందిన షేక్ అబ్దుల్ షరీఫ్ తన కుటుంబ సభ్యులతో ఆరుళ్లలో జరుగుతున్న గంధ మహోత్సవానికి వెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి ఉండటాన్ని గుర్తించి లోపలికెళ్లి పరిశీలించారు. నాలుగు బీరువాల తాళాలు తీసి రూ.70 వేలు, నాలుగు బంగారు గాజులు, ఐదు ఉంగరాలు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. కరీమావీధికి చెందిన షేక్ హుస్సేనీ కుటుంబం హైదరాబాద్‌లో ఉంటోంది. వారింట్లో కూడా గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి రూ.10 వేలు నగదు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌టీమ్ వేలిముద్రలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.