
అవయవదానంతో పునర్జన్మ
నెల్లూరు(అర్బన్): అవయవదానంతో పది మందికి పునర్జన్మను ప్రసాదించొచ్చని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడారు. అవయవదానంపై అవగాహన కల్పించేలా జిల్లా స్థాయిలో వైద్యులు కృషి చేయా లని కోరారు. అవయవదాన గొప్పదనాన్ని తెలుసుకొని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం విశాఖపట్నం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యుడు రాంబాబు మాట్లాడారు. అవయవాల కొరతతో దేశంలో ఐదు లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
అవయవదాత భర్తకు సత్కారం
గతంలో ఓ ప్రమాదంలో జ్యోతి అనే మహిళకు బ్రెయిన్‌డెడ్ అయింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె అవయవాలను దానం చేసి పలువురు జీవితాల్లో వెలుగులను భర్త వెంకటరమణ నింపారు. దీంతో ఆయన్ను కలెక్టర్, వైద్యులు సత్కరించారు. కమిషనర్ నందన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ కొండేటి మాధవి, డీఎంహెచ్‌ఓ సుజాత, అపోలో ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ శ్రీరామ్‌సతీష్, నారాయణ ఆస్పత్రి సూపరింటెండెంట్ దొరసానమ్మ తదితరులు పాల్గొన్నారు.