
లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధం
● తొలి రోజు విచారణలో
సీఐడీ అధికారులతో కాకాణి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇది ముమ్మాటికీ అక్రమ కేసే.. న్యాయస్థాన అనుమతితో లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని.. తనపై అభియోగాలు మోపిన వారికీ దీన్ని నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీఐడీ అధికారులను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారని సమాచారం. జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డిని.. ప్రభుత్వ భూములను తారుమారు చేశారనే కేసులో కోర్టు అనుమతితో సీఐడీ అధికారులు రెండు రోజుల విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. తనపై కూటమి ప్రభుత్వం బనాయించిన మరో అక్రమ కేసుగా భావించాలే తప్ప, తనకు సంబంధం ఉందని మీరు ఎలాంటి ఆధారాన్ని చూపినా న్యాయస్థానానికెళ్లి తగిన శిక్షను విధించాలని న్యాయమూర్తిని కోరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాకాణి తెలిపారని సమాచారం. చెముడుగుంటలోని డీటీసీలో కాకాణి తరఫు న్యాయవాది సిద్ధన సుబ్బారెడ్డి సమక్షంలో తొలి రోజు 26 ప్రశ్నలేసి విచారించగా, దీనికి కాకాణి దీటుగా సమాధానమిచ్చారు. అసైన్మెంట్ కమిటీ సమావేశాల్లో అధికారులు ప్రతిపాదించిన భూములపైనే చర్చ జరుగుతుందని.. కొన్నిసార్లు చర్చ జరగకుండా, ఎమ్మెల్యేల సమ్మతితో సంబంధం లేకుండా, తమ సంతకాల్లేకుండానే జిల్లాలో లబ్దిదారులను ఎంపిక చేసి వీటిని కేటాయించిన సందర్భాలున్నాయనే అంశాన్ని గుర్తుచేశారని తెలిసింది. కాకుటూరు భూముల విషయంలో తమ ప్రభుత్వ హయాంలోనే కేసు నమోదు చేశారని, నియోజకవర్గంలో ఎక్కడైనా అవకతవకలు జరిగినా, ఎవరైనా అక్రమాలకు పాల్పడినా ఎవర్నీ ఉపేక్షించకుండా చర్యలు చేపట్టాలని ప్రతి సమావేశంలో అధికారులను కోరేవాడినన్నారని సమాచారం. తనకు సంబంధం లేని విషయాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని, అధికారుల పరిధిలో ఉన్న విషయాలను ప్రజాప్రతినిధిగా సమీక్షిస్తే అది వారి పనితీరును ప్రభావితం చేస్తుందేమోననే ఉద్దేశంతో పూర్తిస్థాయి స్వేచ్ఛను కల్పించి విచారణ చేపట్టమనేవాడినన్నారని తెలిసింది. జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు చేపట్టే చర్యలపై జోక్యం చేసుకుంటే తప్పుడు సంకేతాలెళ్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, భూముల విషయంలో జోక్యం చేసుకోలేదన్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరించాలని అధికారులను తానెన్నడూ కోరలేదని కాకాణి స్పష్టం చేశారని సమాచారం. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక అనేక అభియోగాలు మోపేవారని.. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన చేతిలో రెండుసార్లు ఓటమి పాలు కావడంతో అర్థరహిత విమర్శలు చేసేవారని, వీటిని తానెప్పుడూ పట్టించుకోలేదని తెలిపారని సమాచారం.