
చెక్ పవర్ రద్దుకు కుట్రలు
వెంకటాచలం పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులను చేయించాం. పనులపై రాజకీయ కక్షతో ఇప్పటివరకు రెండుసార్లు విచారణ జరిపించారు. అవినీతికి సంబంధించిన ఒక్క ఆధారం లభించకపోవడంతో పునర్విచారణకు కమిటీని నియమించారు. పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన నగదును సర్పంచ్ భర్త అకౌంట్‌లో జమ చేయడం తప్పెలా అవుతుంది. పనులు చేయకుండా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఎక్కడా నిరూపించలేకపోయారు. చెక్‌పవర్‌ను రద్దు చేయాలనే ఇన్ని కుట్రలు చేస్తున్నారు.
– మందల రాజేశ్వరి, వెంకటాచలం సర్పంచ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి కుట్రలు.. భేతాళ కథలను తలపిస్తున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో కీలక నేత, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్యను వీరు టార్గెట్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో ఓ మహిళతో తప్పుడు కేసు పెట్టించి 18 రోజుల పాటు జైల్లో నిర్బంధించి వేధింపులకు గురిచేశారు. కనుపూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు చేశారనే కేసులో ఆయన పేరును ఇటీవల చేర్చగా, హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
తెరపైకి కుట్రలు
వెంకటశేషయ్యపై తప్పుడు కేసులు మోపి జైలుకు పంపినా సంతృప్తి చెందని కూటమి నేతలు తాజాగా మరో అడుగు ముందుకేశారు. వెంకటాచలం సర్పంచ్‌గా ఉన్న ఆయన భార్య రాజేశ్వరి చెక్‌పవర్‌ను రద్దు చేయించేందుకు కుట్రలు పన్నారు. ఇందులో భాగంగానే వెంకటాచలం పంచాయతీలో అక్రమాలు జరిగాయని, విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో ఇప్పటికి రెండుసార్లు విచారణ జరిపారు. అయితే నిధుల దుర్వినియోగంపై ఆధారాల్లేక మిన్నకుండిపోయారు.
పచ్చ పత్రిక కథనం.. పునర్విచారణ
విచారణ సక్రమంగా జరగలేదని, పంచాయతీ నిధుల్లో రూ.64.54 లక్షలను సర్పంచ్ భర్త అకౌంట్‌కు మళ్లించారంటూ ఓ పచ్చ పత్రికలో కథనాన్ని ఇటీవల ప్రచురించారు. దీంతో జిల్లా అధికారులు పునర్విచారణకు ఆదేశిస్తూ జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డితో కమిటీని నియమించారు. అవినీతికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో అధికారులపై కూటమి నేతలు ఒత్తిడి తీసుకొచ్చి, పునర్విచారణకు కమిటీని నియమించేలా చేశారు.
వెంకటాచలం గ్రామ సచివాలయం
వైఎస్సార్సీపీ బీసీ నేత వెంకటశేషయ్య కుటుంబంపై రాజకీయ వేధింపులు
ఓ కేసులో జైల్లో 18 రోజుల నిర్బంధం
తాజాగా మరొకటి నమోదు
భార్య, సర్పంచ్ రాజేశ్వరి చెక్‌పవర్ రద్దుకు కుతంత్రాలు