
విద్యుత్ బిల్లుల ‘షాక్’
కావలి మండలం మద్దూరుపాడులోని ఇందిరా సీడ్స్ యజమాని దేవరపల్లి గిరిధర్‌రెడ్డికి కొన్ని సంవత్సరాలుగా ప్రతినెలా రూ.8 వేల్లోపే విద్యుత్ బిల్లు వచ్చేది. కొత్తగా స్మార్ట్ మీటరు అమర్చిన తర్వాత వచ్చిన మొదటి నెల బిల్లు రూ.లక్ష పైనే. దీంతో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు.
కావలి(జలదంకి): కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లు కలకలం రేపుతున్నాయి. ఒక్కసారిగా బిల్లులు అధికంగా వస్తుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్క కావలి పట్టణంలోనే సుమారు 12 వేల వరకు స్మార్ట్ మీటర్లు బిగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గృహాలకు కూడా బిగించే పనిలో సిబ్బంది ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే విద్యుత్ పంపిణీ సంస్థలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కొంతమంది సిబ్బందితోపాటు మీటర్ రీడర్లు కూడా ఉద్యోగాలు కోల్పేయే అవకాశాలున్నాయి. కాగా స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత వస్తున్న బిల్లులు చూసి వినియోగదారులకు షాక్ అవుతున్నారు. ప్రతినెలా రూ.6 వేల నుంచి రూ.8 వేలు వచ్చే బిల్లులు నేడు రూ.లక్షల్లో వస్తుండటంతో వ్యాపారుస్తులు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి రూ.లక్ష పైన బిల్లు ఎందుకు వస్తుందని వారు విద్యుత్ సిబ్బందిని అడిగితే ఈసారికి నగదు కట్టండి తర్వాత సరిచేస్తామని చెబుతున్నారు.
దోచుకోవడమే..
స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నెల్లూరులో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కొత్తగా విద్యుత్ మీటర్లు బిగించడం వల్ల బిల్లులు అధికంగా వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ విషయంపై ఆయా శాఖాధికారులు చర్యలు చేపట్టాలని అన్నారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
కావలిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు
అధికంగా వస్తున్న బిల్లులు
ప్రజలపై ‘కూటమి’ భారం

విద్యుత్ బిల్లుల ‘షాక్’