
వీఎస్‌యూలో అడ్మిషన్ల గడువు పొడిగింపు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కోసం అడ్మిషన్ల గడువును ఈనెల 31 తేదీ వరకు పొడిగించినట్లు డీఓఏ డైరెక్టర్ డాక్టర్ ఎం.హనుమారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ నాలుగు సంవత్సరాల హానర్స్, నాలుగు సంవత్సరాల హానర్స్ విత్ రీసెర్చ్ పాసైన విద్యార్థులు పీజీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీకి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం వీఎస్‌యూలోని డీఓఏ కార్యాలయంలో సంప్రదించాలని తెలియజేశారు.
రైలు కింద పడి..
● వృద్ధుడి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ రైలు కింద పడి గుర్తుతెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి నెల్లూరు – వేదాయపాళెం మధ్యలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడి వయసు 65 నుంచి 70 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పసుపు రంగు ఫుల్‌హ్యాండ్స్ చొక్కా, పసుపు రంగు పంచె, కాషాయ రంగు టవల్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా
జామాయిల్ నరికివేత
దుత్తలూరు: మండలంలోని భైరవరం పంచాయతీ మజరా గ్రామమైన తురకపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు వల్లెం మల్లారెడ్డికి చెందిన పొలంలో టీడీపీ నాయకులు అక్రమంగా జామాయిల్ నరికి అమ్మే ప్రయత్నం చేశారు. భైరవరం రెవెన్యూ సర్వే నంబర్ 367లో 2.50 ఎకరాల భూమిలో మల్లారెడ్డి పదేళ్ల క్రితం జామాయిల్ సాగు చేపట్టారు. అయితే ఇదే సర్వే నంబర్‌లో కొంత భూమి కలిగి ఉన్న టీడీపీ నేత బోగిరెడ్డి ఓబుల్‌రెడ్డి మంగళవారం జామాయిల్ కర్ర కొట్టించారు. లారీకి లోడు చేయించి తరలిస్తుండగా బాధితుడు తహసీల్దార్ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందిని పంపించి లారీని స్వాధీనం చేసుకుని దుత్తలూరు పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఆ భూమి వివాదాస్పదంలో ఉన్నందున ఎవరూ ప్రవేశించరాదని బోర్డు పెట్టడం జరిగిందన్నారు. నిబంధనలు అతిక్రమించి ప్రవేశించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.