
ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదు
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులను మోపుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదని పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే, పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి కిలివేటి సంజీవయ్య, పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పూజిత గురువా రం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పదవుల్లో పనిచేసి మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులను మోపి అరెస్ట్ చేయడంతో జిల్లా ప్రజలు విస్తుపోయారని చెప్పారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా మద్యం కేసంటూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని తాజాగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. హామీలను అమలు చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేతలను లక్ష్యంగా చేసుకొని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ కేసులో పార్టీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన్ను బెదిరించి బలవంతపు స్టేట్‌మెంట్ తీసుకొని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పేరును చేర్చారని ధ్వజమెత్తారు. కూటమి నేతలిచ్చిన స్క్రిప్టును అమలు చేస్తూ.. ప్రేక్షకపాత్రకే పోలీసులు పరిమితమయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ప్రజలకు ఆదాయ వనరులు తగ్గిపోయి.. వ్యాపారాలు సాగక ఇబ్బంది పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం పీ4 విధానమంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తోందని ఎద్దేవా చేశారు. 2014, 2019లో తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని జైలుకు పంపేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకోలేక ఇలాంటి కుటిల రాజకీయాలను అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలను తగ్గించాలనే లక్ష్యంతో మెరుగైన మద్యం పాలసీని తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చారని వివరించారు. ఇందులో అక్రమాలు జరిగాయంటూ తమ పార్టీకి చెందిన 38 మంది నేతలపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. అక్రమ కేసులు బనాయించిన వారికి పార్టీ అండగా ఉంటూ.. చట్టపరంగా పోరాడతామని భరోసా ఇచ్చారు.
అరాచక పాలన
ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనను సాగిస్తోందని కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. డిస్టిలరీలను ఏర్పాటు చేసి.. మద్యం బ్రాండ్లు తీసుకొచ్చింది చంద్రబాబు కాదానని ప్రశ్నించారు. హామీలను అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని విమర్శించారు. గుర్తుతెలియని వ్యక్తుల దాడి కారణంగానే మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసం ధ్వంసమైందంటూ కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
పరిపాలనను గాలికొదిలారు..
పరిపాలనను టీడీపీ గాలికొదిలిందని ఆనం విజయకుమార్‌రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ నేతలపై ఏదో ఒక కేసు పెట్టి విచారణ పేరిట పిలిచి వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కాకాణిపై కేసులు పెట్టి వేధించడం దారుణమని చెప్పారు. అసలు ఏమి సాధించాలని టీడీపీ ఇలా వ్యవహరిస్తోందో అర్థం కావడంలేదని తెలిపారు.