మనీస్కామ్‌ కేసును నీరుగార్చారు | - | Sakshi
Sakshi News home page

మనీస్కామ్‌ కేసును నీరుగార్చారు

Jul 25 2025 4:24 AM | Updated on Jul 25 2025 4:24 AM

మనీస్కామ్‌ కేసును నీరుగార్చారు

మనీస్కామ్‌ కేసును నీరుగార్చారు

కావలి(జలదంకి): కావలి ముసునూరులో అనంతపద్మనాభ అసోసియేషన్‌ పేరిట మనీస్కామ్‌ సూత్రధారి సుభానీ పన్నిన వలలో వేలాది మంది ఉద్యోగులతోపాటు పేదలు మోసపోయారని, కేసును పోలీస్‌ యంత్రాంగం నీరుగార్చి అన్యాయం చేసిందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. ఈ స్కామ్‌లో కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, డీఎస్పీ, రూరల్‌ సీఐలు రూ.100 కోట్ల మేర వాటాలు పంచుకున్నారనే విషయం తెలిసిందన్నారు. దగదర్తిలో రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో మనీస్కామ్‌ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో రూ.800 కోట్ల మేర జరిగిందని, ఇందులో ఎమ్మెల్యే పాత్రను ప్రస్తావించానని చెప్పారు. అనంతరం తాను బెంగళూరు వెళ్లానని, అయితే తాను పారిపోయానని, దాక్కున్నానని, మద్యం కేసులో అరెస్ట్‌ అంటూ ఎమ్మెల్యే అనుచర మీడియా ట్రోల్స్‌ చేశారని విమర్శించారు. కావలిలో ఎమ్మెల్యే ద్వారా ఉద్యోగం తెచ్చుకున్న రాధాకృష్ణ అనే కానిస్టేబుల్‌తోపాటు 17 మంది డైరెక్టర్లుగా ఏర్పడి వారు మరికొందరికి ట్రైనింగ్‌ ఇచ్చి రూ.లక్షకు రోజుకు ఆరు శాతం నగదు ఇస్తామంటూ భారీగా కట్టించుకున్నారని ఆరోపించారు.

రూ.35 కోట్లేనా?

మొదట్లో అలాగే నగదు అందించడంతో పోలీస్‌, రెవెన్యూ, విద్యుత్‌ తదితర ఉద్యోగులతోపాటు కింది స్థాయి ఉద్యోగులు, అలాగే ఏజెంట్ల మాటలు నమ్మి ఎంతోమంది పేదలు ఆస్తులు, బంగారాన్ని తాకట్టు పెట్టి కట్టారని వివరించారు. కావలి నియోజకవర్గంలోనే దాదాపు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల మేర నగదును చెల్లించారని వివిధ పత్రికలు, చానళ్లలో వార్తలొచ్చాయని తెలిపారు. పేదలందరికీ న్యాయం చేస్తానంటూ ఆ సమయంలో ఎమ్మెల్యే ఊదరగొట్టారని చెప్పారు. సుభానీని పదిరోజులపాటు తూతూమంత్రంగా విచారించి తెలంగాణలోనూ స్కామ్‌ జరిగిందంటూ అక్కడికి తరలించారన్నారు. తాము నష్టపోయామని బాధితులు తెలిపేందుకు యత్నిస్తే కావలి డీఎస్పీ, సీఐలు వారిని భయపెట్టి విషయాన్ని బయటకు రానీయకుండా చేశారని ఆరోపించారు. రూ.35 కోట్ల మేర స్కామ్‌ జరిగిందని, అందులో రూ.15 కోట్లను రికవరీ చేశామంటూ కేసును తప్పుదోవ పట్టించి ఎంతోమంది పేదలకు అన్యాయం చేశారన్నారు. ఒక్క పోలీస్‌ డిపార్ట్‌మెంట్లోనే 71 మంది రూ.కోట్లు కట్టి మోసపోయి బయటకు చెప్పకుండా బాధను అనుభవిస్తున్నారన్నారు. కానిస్టేబుల్‌ రమేష్‌ రూ.లక్షలు కట్టి ఏమీ చేయలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. తనపై, నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బయపడేది లేదని, అవినీతిని ఎండగడతామని స్పష్టం చేశారు. దగదర్తిలో మనీస్కామ్‌పై మాట్లాడిన తనను సీఐ రాజేశ్వరరావు బెదిరించారని, వీటికి భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ఆయన్ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. స్కామ్‌పై సీబీఐతో విచారణ జరపాలన్నారు. బాధితుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను త్వరలో ఏర్పాటు చేసి వారు నష్టపోయిన వివరాలను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. కావలి, కావలి రూరల్‌, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్లు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, వాయిల తిరుపతి, మద్దిబోయిన వీరరఘు, బీద రమేష్‌బాబు, వెలినేని మహేష్‌నాయుడు, జెడ్పీటీసీ జంపాని రాఘవులు, నేతలు కనమర్లపూడి వెంకటనారాయణ, పందింటి కామరాజు, గంధం ప్రసన్నాంజనేయులు, కుందుర్తి కామయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు రూ.90 కోట్లు, డీఎస్పీ, సీఐకు రూ.5 కోట్ల చొప్పున ముడుపులు

పేదలకు న్యాయం చేయడంలో పోలీస్‌ యంత్రాంగం విఫలం

నష్టపోయిన ప్రతి ఒక్కరికీ

అండగా ఉంటాం

కావలి మాజీ ఎమ్మెల్యే

రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement