
కోర్టులు.. జైళ్లు సరిపోవు
సాక్షిప్రతినిధి, నెల్లూరు: రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని ప్రతి విషయానికి కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాళ్లు, జైళ్లు సరిపోవని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్‌రెడ్డిపై నమోదైన కేసులో శుక్రవారం నెల్లూరురూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఆయన్ను విచారించారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీధర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆరోపణలపై స్పందించానే తప్ప తానెక్కడా ఆమైపె వ్యక్తిగత ఆరోపణలు చేయలేదన్నా రు. నా వ్యాఖ్యలకు ద్వందార్థాలు తీశారని, అపార్థం చేసుకుని కేసులు పెట్టడం జరిగిందన్నారు. సమావేశంలో నాతోపాటు వేదిక మీద ఉన్న ఐదుగురు నవ్వారని, చప్పట్లు కొట్టారని వారిపైనా కేసులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి చర్యలను ఇటీవల న్యాయమూర్తులు ఖండించారని గుర్తు చేశారు. నా ఇంటి మీద దాడి చేసిన వారి పేర్లతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారం తర్వాత ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. జిల్లా చరిత్రలో ఇళ్ల మీద దాడులు చేయడం ఇదే తొలిసారి అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారన్నారు. అందరి మీద కేసులు పెడుతాం, జైళ్లలో పెట్టిస్తాం అనుకుంటే.. రేపనేది ఒకటి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎల్లకాలం వీరు అధికారంలో ఉండరని, మళ్లీ మేము అఽధికారంలోకి వస్తాం. మాకు రెడ్‌బుక్ రాజ్యాంగం అవసరం లేదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త నుంచి అధినాయకుడి వరకు మా బ్రెయిన్‌లోనే కంప్యూటర్ ఉంటుంది. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వారందరి సంగతి మేము అప్పుడు చూస్తామని ప్రసన్నకుమార్‌రెడ్డి హెచ్చరించారు.
మూడు గంటలు.. 40 ప్రశ్నలు
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫిర్యాదుతో కోవూరు పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో శుక్రవారం కోవూరు సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈ నెల 21వ తేదీన కోవూరు సీఐ వి. సుధాకర్‌రెడ్డి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి 35 (3) బీఎన్‌ఎస్‌ఎస్ కింద నోటీసు జారీ చేశారు. కొన్ని కారణాలతో విచారణ స్థలాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి మార్చారు. దీంతో ప్రసన్నకుమార్‌రెడ్డి పలువురు వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి ఉదయం 10 గంటలకు మూలాపేటలోని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన న్యాయవాదులను మాత్రమే పోలీసులు కార్యాలయంలోకి అనుమతిచ్చారు. రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోవూరు సీఐ వి. సుధాకర్‌రెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని విచారించారు. పోలీసులు అడిగిన 40 ప్రశ్నలకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మూడు గంటలపాటు విచారణ సాగింది. అప్పటికే కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలివచ్చి ప్రసన్నకుమార్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించారు.
నవ్వారని, చప్పట్లు కొట్టారని
కేసులు పెట్టడం హాస్యాస్పదం
దమ్ముంటే రాజకీయంగానే
ఎదుర్కొవాలే గానీ.. తప్పుడు
కేసులు సరికాదు
మాజీమంత్రి నల్లపరెడ్డి
ప్రసన్నకుమార్‌రెడ్డి