
ధిక్కారంతో ముందుకెళ్తే దిక్కు లేకుండా చేస్తాం
ఉలవపాడు: ‘కూటమి ప్రభుత్వం ధిక్కారంతో ముందుకెళ్తే కరేడు భూ సేకరణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. దిక్కు లేకుండా చేస్తాం’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు. శుక్రవారం కరేడు పంచాయతీలో భూములతోపాటు గృహాలు కూడా కోల్పోతున్న రామకృష్ణాపురం, ఉప్పరపాళెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పుట్టిన గడ్డకు ప్రజలకు ఉండే సంబంధం వెలకట్టలేనిది. డబ్బులతో విడదీయాలనుకుంటే కుదరదన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించడం ఏంటని ప్రశ్నించారు. జగనన్న కరేడు రైతులకు అండగా ఉంటారని, ఆయన ఆదేశాల మేరకు తానిక్కడకు వచ్చినట్లు తెలిపారు.
మీ ప్రభుత్వాన్ని బుల్‌డోజర్‌తో తప్పిస్తారు
మీరు పోలీసులను పెట్టి బలవంతంగా బుల్‌డోజర్‌తో ఆక్రమించాలని చూస్తే మీ ప్రభుత్వాన్ని అదే బుల్‌డోజర్‌తో తప్పిస్తారని జూపూడి హెచ్చరించారు. అమరావతిలో లక్షల ఎకరాలు భూసేకరణ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, ఖాళీ, బీడు భూముల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. చంద్రబాబు కుప్పంలో ప్రతి ఇంటి మీద సోలార్ బిగిస్తున్నాడు. అలాంటి చోట ఏర్పాటు చేయొచ్చు కదా అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పంటలు పండే భూములను, గ్రామాలను పరిశ్రమలకు సేకరించడం వ్యతిరేకమన్నారు. గ్రామాలను తీసుకోకూడదని జగన్ చెప్పారన్నారు. రాష్ట్రం మొత్తం కరేడు వైపు చూస్తోందన్నారు. ఉద్యమంలోకి గాలోడు పాత్రలతో కొందరు విచ్ఛిన్నం చేయడానికి వస్తారని వారిని గమనించాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరి పక్షమో తేల్చుకోవాలన్నారు. కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు నన్నం పోతురాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ధనకోటేశ్వరరావు, కరేడు గ్రామ అధ్యక్షులు సీతారామిరెడ్డి, కరేడు రైతు ఉద్యమ నాయకులు మిరియం శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌లు కృష్ణారావు, సుబ్బారావు, నియోజకవర్గ ఉద్యోగ, పెన్షన్ వింగ్ అధ్యక్షుడు ఆదాం, వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యనమల మాధవి, మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రభావతి, పాకల వైఎస్సార్ సీపీ పార్టీ అధ్యక్షుడు కేశవరపు కృష్ణారెడ్డితోపాటు కరేడు గ్రామ రైతులు పాల్గొన్నారు.
నమ్మి ఓట్లు వేస్తే
గ్రామాలే లేకుండా చేస్తారా
పరిశ్రమలు రావాలే కానీ
పచ్చని గ్రామాలు, పొలాల్లో కాదు
కరేడు రైతులకు వైఎస్సార్‌సీపీ
సంపూర్ణ మద్దతు
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి
కరేడు పంచాయతీ రామకృష్ణాపురం, ఉప్పరపాళెం గ్రామాల్లో పర్యటన