
అక్రమ కేసులతో డైవర్షన్ పాలిటిక్స్
● మాజీ మంత్రి కారుమూరి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి, పార్టీ పార్లమెంట్ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, కాకాణి పూజితతో కలిసి విలేకరులతో కారుమూరి శుక్రవారం మాట్లాడారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ పార్లమెంట్ రీజినల్ కోఆర్డినేటర్‌గా తనకు బాధ్యతలను పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకొని, జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో పార్టీలకతీతంగా నాయకులు కలిసిమెలిసి ఉండేవారని, అయితే ప్రస్తుతం పరిస్థితి దీనికి భిన్నంగా మారిందని చెప్పారు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులను కూటమి ప్రభుత్వం బనాయిస్తూ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై మోపిన అక్రమ కేసుతోనే ఈ విషయం స్పష్టమవుతోందని చెప్పారు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి దుర్మార్గమని.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, అంతమాత్రాన ఇళ్లపై పడి విధ్వంసం సృష్టించడం సరికాదని హితవు పలికారు. ఈ విధమైన దాడులు సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వ పథక రచనలో భాగంగానే మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌కు నోటీసులిచ్చారని చెప్పారు. లిక్కర్ కేసనే అభియోగాన్ని ఎంపీ మిథున్‌రెడ్డిపై మోపి అరెస్ట్ చేశారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి రూ.27 వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మద్యం దుకాణాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేసి.. లిక్కర్‌కు ప్రజలు బానిసలయ్యేలా ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి.. డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని యత్నిస్తే, వేల గొంతుకలు ప్రశ్నిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని టీడీపీకి హితవు పలికారు. ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోనే మూడు లక్షల కోట్ల అప్పుచేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి.. జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు.
జిల్లాలో ఈ సంస్కృతి ఎన్నడూ లేదు
జిల్లాలో తమ పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలో ఈ తరహా దుష్ట సంస్కృతిని ఎన్నడూ చూడలేదన్నారు. ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెడుతూ పీటీ వారెంట్లు జారీ చేస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రసన్న ఇంటిపై 200 మంది టీడీపీ గూండాలు దాడి చేస్తే.. గుర్తుతెలియని వ్యక్తుల దాడంటూ పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తే దాడిలో పాల్గొంది ఎవరనేది స్పష్టంగా అర్థమవుతుందని, అన్ని ఆధారాలను అందజేసినా చర్యలు శూన్యమని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి పోలీసులు, ఇంటెలిజెన్స్ వంతపాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు నమోదు చేసినా పార్టీ అండగా నిలిచి.. చట్టపరంగా పోరాటం చేస్తు ముందుకెళ్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు పందింటి కామరాజు, పోతరాజు చంద్రశేఖర్, సిద్ధిఖ్, దివ్యాంగ విభాగ జిల్లా అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.