
పరిశ్రమల ఏర్పాటుతో జిల్లా అభివృద్ధి
నెల్లూరు(అర్బన్): పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి.. జిల్లా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన పరిశ్రమలు – ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ డెస్క్ పోర్టల్లో 1700 దరఖాస్తులు రాగా, 1616ను ఆమోదించగా, 20 అప్లికేషన్లను తిరస్కరించామని వివరించారు. పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లీగల్ మెట్రాలజీ అధికారులు తమ శాఖ పరిధిలోని అంశాలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. మెగా ప్రాజెక్టుల ద్వారా 13,599 మందికి, పెద్ద పరిశ్రమల ద్వారా 7,557 మందికి ఉద్యోగాలను కల్పించామని వెల్లడించారు. జాన్సన్ ఇన్‌ఫ్రా, ఉత్కర్ష అల్యూమినియం, క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ, విశ్వసముద్ర బయో ఎనర్జీ తదితర కంపెనీలు త్వరగా ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జేసీ కార్తీక్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మారుతిప్రసాద్, ఏపీఐఐసీ జెడ్‌ఎం శివకుమార్, ఆర్డీఓలు పావని, అనూష, వంశీకృష్ణ, పరిశ్రమలు – ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సభ్యుడు భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని 15 సూత్రాల అమలుపై సమీక్ష
ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు 15 శాతానికి తగ్గకుండా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమ అమలుపై కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గృహ నిర్మాణ, ఉపాధి హామీ, విద్య, సామాజిక పింఛన్లు, వైద్యం, మత్స్య సంపద యోజన, రుణాల మంజూరు తదితరాలను మైనార్టీలకు చేరువ చేయాలని సూచించారు. నెల్లూరు రూరల్ మండల పరిధిలోని అక్కచెరువుపాడులో ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను పూర్తి చేయాలని కోరారు. ముస్లిం మైనార్టీ జిల్లా సంక్షేమాధికారి హైఫా, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, డీఈఓ బాలాజీరావు, డ్వామా పీడీ గంగాభవాని, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, పరిశ్రమల శాఖ జీఎం మారుతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.