
జిల్లాలో ఇలా..
కోర్సు సీట్లు భర్తీ అయినవి
సీఎస్‌ఈ 3972 2672
ఈసీఈ 1632 1132
ఏఐఎం / ఏఐఎమ్మెల్ 1296 985
సీసీ / ఏఐడీ 768 607
ఏఐ / సీఏఐ 715 581
సివిల్ 228 98
సీఎస్డీ 216 32
సీసీ / ఏఐడీ 768 607
ట్రిపుల్ ఈ 372 177
ఐఎన్నెఫ్ / డీఎస్ / సీఎస్‌ఓ 192 12
మెకానికల్ 276 113
ఈవీటీ 48 00
నెల్లూరు
ఇంజినీరింగ్
కళాశాలలు
13
● కళాశాలల యాజమాన్యాల ఆశలు ఆవిరి
● ముగిసిన తొలి విడత కౌన్సెలింగ్
● జిల్లాలో ఈ ఏడాది 66 శాతం సీట్లే భర్తీ
● గతేడాదితో పోలిస్తే 11 శాతం పతనం
● పొరుగు రాష్ట్రాలవైపే మొగ్గు
● ఆశలన్నీ రెండో విడతపైనే
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీట్ల భర్తీ కోసం నానా తంటాలు పడుతున్నారు. ఆశించిన స్థాయిలో భర్తీ కాకపోవడం.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో కాలేజీలే మూతపడుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో గతంలో 24 ఇంజినీరింగ్ కళాశాలలుండగా, ప్రస్తుతం ఇది 13కే పరిమితమైంది.
నూరు శాతం భర్తీ.. మిథ్యే
గత విద్యా సంవత్సరంలో 77 శాతం సీట్లు భర్తీ కాగా, ఈ ఏడాది 11 శాతం పతనమైంది. జిల్లాలోని ఏ కాలేజీలోనూ నూరు శాతం భర్తీ కాలేదు. రెండు కళాశాలల్లో పది శాతంలోపు, మరో మూడు చోట్ల 39 శాతంలోపే భర్తీ కావడంతో ఏమి చేయాలో పాలుపోక యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో మరిన్ని మూతపడే ప్రమాదం పొంచి ఉంది.
మారిన పరిస్థితి
బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ఇంజినీరింగ్ కళాశాలలో సీటు దొరికితే చాలనే భావన గతంలో ఉండేది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. తొలి విడత కౌన్సెలింగ్ బుధవారంతో ముగియగా, ఈ విషయాలు స్పష్టమయ్యాయి. జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ బ్రాంచ్‌లలో 9715 సీట్లుండగా, 6409 మాత్రమే భర్తీ అయ్యాయి. ఎక్కడా నూరు శాతం భర్తీ కాకపోవడం గమనార్హం.
భర్తీ అయింది ఇలా..
నారాయణ (నెల్లూరు)లో 98.68.. నారాయణ (గూడూరు)లో 97.98.. ఏఈసీఎన్‌లో 94.91.. ఎన్బీకేఆర్‌లో 92.93.. జీటీఎన్నెన్‌లో 88.15.. ఏఎస్‌ఈటీలో 71.71.. ఆరెస్సార్‌ఎన్‌లో 70.51.. విశ్వోదయలో 67.39.. ఎస్వీసీఎన్‌లో 38.64.. డీఎస్సైటీలో 28.09.. జీకేసీఎస్‌లో 26.85.. పీఐఎన్నెన్‌లో 6.25.. పీఆర్‌ఐకేలో 4.69 శాతం సీట్లే భర్తీ అయ్యాయి.
కొన్ని కోర్సులకే డిమాండ్
ఇంజినీరింగ్‌లో సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఏఐఎమ్మెల్, సీఎస్డీ, సీఎస్సీ, ఈసీఏ, ట్రిపుల్ ఈ, ఏఐ, ఐఎన్నెఫ్ తదితర కోర్సులున్నాయి. అయితే సీఎస్‌ఈ, ఈసీఈ, ఏఐఎమ్మెల్ కోర్సులకే డిమాండ్ ఎక్కువగా ఉంది.
పక్క రాష్ట్రాలకే సై..
ఇంజినీరింగ్‌ను అభ్యసించేందుకు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ తదితర రాష్ట్రాలవైపు జిల్లా విద్యార్థులు అడుగులేస్తున్నారు. జిల్లాలోని కాలేజీల్లో వసతుల లేమి.. క్వాలిఫైడ్ అధ్యాపకుల్లేకపోవడం.. నాణ్యమైన బోధన అందకపోవడం.. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడం సైతం దీనికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ఎక్కువ మంది పొరుగు రాష్ట్రాల్లోని కాలేజీల్లో ప్రవేశాలు పొందారు. మరోవైపు ఇటీవలి కాలంలో సాఫ్ట్‌వేర్ రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉద్యోగాలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. నాణ్యత గల కళాశాలల నుంచి వచ్చిన వారికే కంపెనీలు అవకాశమిస్తుండటం సైతం దీనికి కేంద్రబిందువవుతోంది.
ఇంజినీరింగ్.. ఈ కోర్సు అంటేనే క్రేజ్. దీన్ని అభ్యసించి సాఫ్ట్‌వేర్ రంగంలో కొలువుదీరి.. ఇతర దేశాల్లో స్థిరపడాలనే కోరిక గతంలో బలంగా ఉండేది. అయితే ప్రస్తుతం ఈ ఊపు లేకపోవడం.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పరిస్థితి అయోమయంగా మారింది. ఫలితంగా కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం యాజమాన్యాలు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీలు గతంలో 24 ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 13కు పతనమైందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత విద్యా సంవత్సరంలో 77 శాతం సీట్లు భర్తీ కాగా, ఈ ఏడాది 11 శాతం క్షీణించి 66 శాతానికే పరిమితమైంది.

జిల్లాలో ఇలా..

జిల్లాలో ఇలా..