
నగదు తీసివ్వాలని సాయం కోరితే..
పొదలకూరు: ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయడం తెలియక ఓ రైతు అక్కడే ఉన్న యువకుడిని సాయం కోరగా అతను రూ.40 వేలు తస్కరించాడు. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. చేజర్ల మండలం నూతకివారికండ్రిక గ్రామానికి చెందిన యనమల పెంచలకృష్ణారెడ్డి సోమవారం పొదలకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కనే ఉన్న ఏటీఎంలో రూ.5 వేలు డ్రా చేసేందుకు వెళ్లాడు. అయితే ఆయనకు ఏటీఎం ఆపరేటింగ్ తెలియదు. దీంతో అక్కడే ఉన్న గుర్తుతెలియని ఓ యువకుడిని నగదు విత్‌డ్రా చేసి ఇవ్వాల్సిందిగా కోరాడు. అతను పెంచలకృష్ణారెడ్డి ఏటీఎం తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని ఆపరేట్ చేస్తున్నట్టు నటించి ఎందువల్లనో నగదు రావడం లేదన్నాడు. అయితే మోసగాడు బాధిత రైతు ఏటీఎం ఇవ్వకుండా తన కార్డు ఇచ్చాడు. పెంచలకృష్ణారెడ్డి గమనించకుండా మార్చి ఇచ్చిన కార్డు తీసుకుని తమ ఊరి పక్కనే ఉన్న ఏటూరు బ్యాంకులో నగదు తీసుకునేందుకు వెళ్లాడు. ఈలోగా యువకుడు మూడుసార్లు పెంచలకృష్ణారెడ్డి ఏటీఎం నుంచి రూ.40 వేలు విత్‌డ్రా చేశాడు. బాధితుడి ఫోన్‌కు మెసేజ్‌లు వెళ్లినా తెలుసుకోలేకపోయాడు. బ్యాంక్ వద్దకు వెళ్లి అకౌంట్లో నగదు పరిశీలించగా రూ.లక్షకు బదులు రూ.60 వేలే ఉంది. వెంటనే అప్రమత్తమై ఉన్న రూ.60 వేలను బాధిత రైతు డ్రా చేశాడు. మంగళవారం గ్రామపెద్దలతో మాట్లాడి పొదలకూరు ఎస్‌బీఐ సిబ్బంది వద్దకు వెళ్లి జరిగిన మోసాన్ని వివరించాడు. సీసీ టీవీ ఫుటేజీని తీసుకుని పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
రూ.40 వేలు తస్కరించిన యువకుడు
పోలీసులకు ఫిర్యాదు చేసిన
బాధిత రైతు