
ఖాళీ బిందెలతో నిరసన
రాపూరు: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద గిరిజన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాపూరు సమీపంలోని ఆంజనేయపురం గిరిజనవాడలో రెండు వారాల క్రితం ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందని, దీనిపై పలుసార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విద్యుత్ లేకపోవడంతో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సుదూరంలోని బోరు వద్దకు వెళ్లి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో ఖాళీ బిందెలతో సబ్‌స్టేషన్‌కు చేరుకుని, నిరసన చేపట్టామన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామని ట్రాన్స్‌కో ఏఈ కార్తీక్ హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు.