
భూసేకరణను ఆపాలని డిమాండ్
ఉలవపాడు: బలవంతపు భూసేకరణను నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో వారి బృందం పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా భూసేకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రావూరు, చేవూరు గ్రామాల రైతులు న్యాయపరంగా హైకోర్టును ఆశ్రయించారన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రజలను చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వ్యవసాయ భూములను ధ్వంసం చేయొద్దన్నారు. పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీల అవసరాల కోసం రైతులతో ఆటలాడొద్దన్నారు. ప్రజల మాటలను గౌరవించి నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ గతంలో కృష్ణపట్నం పోర్టు సమీపంలో రిలయన్స్‌కు 2,800 ఎకరాలు, కిసాన్ సెజ్ కోసం 2,500 ఎకరాలు సేకరించారన్నారు. వారు పరిశ్రమలు కట్టకుండా ఈ భూములపై లోన్లు తీసుకుని వారు వ్యాపారాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులతో బెదిరించి ప్రజలను ఖాళీ చేయించాలని చూస్తే భూసేకరణకు వ్యతిరేకంగా వచ్చే అన్ని పార్టీలతో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు కుమార్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మూలి వెంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సభ్యుడు తాళ్లూరు మాల్యాద్రి, ఇంకా పోట్లూరి రవి తదితరులు పాల్గొన్నారు.