
తవ్వితే పెద్ద స్కామే
● రాష్ట్రంలో అనేక చోట్ల ఆఫీసులు
తెరిచి, ఏజెంట్లను పెట్టి రూ.కోట్లల్లో కాజేసిన కేటుగాళ్లు
● కుంభకోణం వెలుగులోకి రావడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న
బాధితులు
● రూ.వందల కోట్లు దాటుతున్న అక్రమాలు
● రుణగ్రహీతలను కలవకుండానే
బ్యాంకు అధికారులు రుణాలు
● ఈ వ్యవహారం వెనుక బ్యాంకు
అధికారులు, సిబ్బంది పాత్ర
● ఆందోళన ఉధృతం చేస్తామన్న
గిరిజన సంఘాలు
నగరంలోని వనంతోపు సెంటర్లో ఇంటింటా పాచి పనిచేసుకునే చెంబేటి లక్ష్మి నిరక్షరాస్యులు. ఆమెను తమ ఆఫీసుకు తీసుకువెళ్లి ఆధార్ కార్డు తీసుకున్నారు. ఆమెతో కొన్ని కాగితాలపై ఇంగ్లిష్‌లో సంతకం పెట్టించారు. ఆమె పేరుతో రూ.20 లక్షలు రుణాన్ని మంజూరు చేయించి తమ జేబుల్లో వేసుకున్నారు. ఒక్క రూపాయి ఆమెకు ఇవ్వలేదు.
‘కుబేరా’ సినిమాను మించిన స్థాయిలో సాగిన యాక్సిస్ బ్యాంక్‌లో రుణాల కుంభకోణం రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. టీడీపీ సానుభూతిపరుడైన జర్నలిస్టు జాలి వాసుదేవనాయుడు, ఆ పార్టీ మైనార్టీ విభాగం నేత అల్లాభక్షుతో శివ, వెంకట్ కలిసి చేపట్టిన మోసం తొలుత రూ.20 కోట్ల వరకు ఉంటుందని భావిస్తే.. ఈ మోసం వెలుగులోకి రావడంతో ఒక్కొక్కరుగా వస్తున్న బాధితులను బట్టి మరుసటి రోజుకు రూ.50 కోట్ల పైమాటగా ఉంటుందని అంచనా వేశారు. తాజాగా వివిధ జిల్లాల్లో ఉన్న వీరి బాధితులు బయటకు రావడంతో రూ.వందల కోట్లపైనే ఉన్నట్లు తెలుస్తోంది. మోసగాళ్లు, బ్యాంక్ అధికారులు కలిసి సాగించిన ఈ కుంభకోణం తవ్వితే పెద్ద స్కామే అవుతుందని పోలీస్ వర్గాల్లో సైతం గుసగుసలు వినిపిస్తున్నాయి.
భక్తవత్సలనగర్‌కు చెందిన సుమతి వీరి వద్దకు వచ్చి రూ.5 లక్షలు బ్యాంక్ అప్పు అడిగారు. ఆమె వద్ద సంతకాలు, ఆధార్, బ్యాంక్ బుక్స్ తీసుకొని రూ. 5 లక్షలు అప్పుగా ఇచ్చారు. వడ్డీ, అసలు కలిపి ప్రతినెలా వసూలు చేశారు. ఆమె రికార్డులు యాక్సిస్ బ్యాంక్లో పెట్టి రూ.15 లక్షలు కొట్టేశారు.
సాక్షిప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ స్కామ్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం బాధితులు బ్యాంకు వద్దకు వచ్చి సిబ్బందిని నిలదీశారు. వీరి ప్రశ్నలకు సిబ్బంది స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోవడంతో వారి పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంపై బాధితులు ఏడు నెలల క్రితమే ఫిర్యాదు అందినా స్పందించని పోలీస్ యంత్రాంగం కదిలింది. తొలుత జిల్లాకే పరిమితమనుకున్న ఈ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా అనేక బ్యాంక్‌లు మోసపోయిన జాబితాలో ఉన్నట్లు వెలుగులోకి వస్తుండంతో పోలీసులే గుడ్లు తేలేస్తున్నారు. పెద్ద ఎత్తున బాధితులు బయటకు వస్తున్నా.. ఈ కేసు నమోదు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక అధికార పార్టీ పెద్దల ఒత్తిడే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆఫీసులు తెరిచి.. ఏజెంట్లను పెట్టి..
కేటుగాళ్లు జాలి వాసుదేవనాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తులు నాలుగు ఫేక్ సాఫ్ట్‌వేర్ కంపెనీలను సృష్టించి నిరక్షరాస్యులైన గిరిజనులను ఏకంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చూపించి నెల్లూరు, ముత్తుకూరు యాక్సిస్ బ్యాంకుల్లో రూ.20 కోట్ల మేర లూటీ చేశారు. ఇది లాభసాటిగా ఉండడంతో రాష్ట్రంలోని పలు ముఖ్య పట్టణాల్లో ఆఫీసులు తెరిచి, రుణాలిప్పిస్తామని వారి నుంచి ఆధార్, పాన్‌కార్డులు తీసుకుని బ్యాంక్‌ల్లో ఖాతాలు తెరిచి పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు వీరి వద్దనే ఉంచుకుంటున్నారు. ఒక్కొక్కరి పేరుతో రూ.లక్షల్లో, రూ.కోట్లల్లో రుణాలు మంజూరు చేయించి ఈ మొత్తాన్ని తమ ఖాతాల్లోకి వేసుకుంటున్నారు. అసలైన రుణ గ్రహీతలకు రూ.1.50లకే రూ.లక్ష.. రెండు లక్షలిచ్చి వారి నుంచి నెల నెలా రికవరీ చేసుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా రుణాల రికవరీ ఏజెంట్లను పెట్టుకుని దందా సాగించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రుణగ్రహీలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు ఉన్నట్లు కూడా వారికే తెలియదు.
ఏడేళ్లుగా ఒక వ్యవస్థనే సృష్టించారు
బాధితులు చెబుతున్న సమాచారం మేరకు.. దాదాపు ఏడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తునట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న జాలే వాసుదేవనాయుడు ఆయన బృందం ఒక పథకం ప్రకారం ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ఇందు కోసం ఆయన ఒక ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్, బొల్లినేని ఆస్పత్రి సమీపంలో కార్యాలయాలు ప్రారంభించారు. ఇక్కడ సిబ్బందిని నియమించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక అవసరాలున్న వ్యక్తులు, అమాయకులను గుర్తించడానికి ఆయా ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించారు. ఈ ఏజెంట్ల నెట్వర్క్ నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో ఉన్నట్లు భావిస్తున్నారు.
లూటీ సొమ్ముతో జల్సాలు
అమాయకులు, నిరక్షరాస్యుల పేరుతో రూ.కోట్లల్లో రుణాలు తీసుకుని ఆ డబ్బులతో నిందితులు జల్సాలు చేస్తున్నారు. విలాసవంతమై కార్లలో తిరుగుతూ, హోటళ్లల్లో బస చేస్తూ అధికార పార్టీ నేతలతో దగ్గరగా పరిచయాలు పెంచుకుని వారిని అడ్డం పెట్టుకున్నారు. ఇప్పటికే వీరే డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఒకటి.. రెండు సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు.
దుమారంతో కేసు విచారణ వేగవంతం
బ్యాంకుల నుంచి గిరిజనులకు నోటీసులు అందడంతో వారు ఖంగుతిని బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు ఎనిమిది నెలల కిందట ముత్తుకూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి బాధితులు బ్యాంకు, పోలీసుస్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నా వారికి న్యాయం జరగలేదు. బ్యాంకు, పోలీసు అధికారులు వారిని పట్టించుకోలేదు. బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో కొందరు ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. కొందరు బాధితులు ఇటీవల యానాదుల సంక్షేమ సంఘం ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారమే రేపింది. దీంతో పోలీసు అధికారులు హుటాహుటిన కేసులో విచారణ వేగవంతం చేశారు. బ్యాంకు మేనేజర్‌ను ఇప్పటికే అధికారులు విచారించి ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు, పత్రాలను సేకరిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బ్యాంకు మేనేజర్ ఎనిమిది నెలల క్రితం ఇచ్చిన ఫిర్యాదులో వాసుదేవనాయుడు పేరే కీలకంగా ఉంది. దీంతో నిందితులకు, బ్యాంకు సిబ్బందికి మధ్య ఏదైనా వివాదం వచ్చో, లేదా భవిష్యత్లో ఎప్పటికై నా ఈ వ్యవహారం వెలుగులోకి రాకతప్పదనో ఫిర్యాదు ఇచ్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కిసాన్‌నగర్‌కు చెందిన సీహెచ్ శ్రీనివాసులు ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటున్నారు. ఆయన భార్య హైమవతి పేరుతో వారిని అప్పు అడిగారు. రికార్డులన్నీ తీసుకొని రూ.3 లక్షలు బ్యాంక్ నుంచి ఇస్తున్నామని చెప్పారు. ఆ రికార్డు బ్యాంక్ లో పెట్టి రూ.9.60 లక్షలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా బయట కొస్తున్నాయి.