
అక్కసుతోనే అక్రమ కేసులు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ అక్కసు వెళ్లగక్కుతుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అరెస్ట్ చేసి కూటమి రాక్షసత్వాన్ని చాటుకుంటుందన్నారు. ఆదివారం నెల్లూరు రాంజీనగర్‌లోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం కుంభకోణం అంటూ ఒకటి సృష్టించి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కేవలం కక్ష పూరితంగానే మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారన్నారు. ఈ అక్రమ అరెస్ట్‌లను ప్రజలు ఛీదరించుకుంటున్నాయన్నారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్సార్‌సీపీకి బలమైన నేతలుగా ఉన్న పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి తమ పార్టీని దెబ్బతీయాలని కుట్రలకు తెరలేపారన్నారు. గతంలో చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ ఉనికి కోల్పోయేలా చేసిన చరిత్ర పెద్దిరెడ్డి కుటుంబానిదన్నారు. ఆ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మిథున్‌రెడ్డిని అక్రమ అరెస్టు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా ఈ అక్రమ అరెస్ట్‌లు జరుగుతున్నాయన్నారు. ఆ కోవలోనే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారన్నారు. కాకాణిపై 17 అక్రమ కేసులు పెట్టి బెయిల్ రాకుండా నిర్బంధిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వల్లభనేని వంశీ, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి ఇలా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. టీడీపీ చేస్తున్న దుర్మార్గాలను అక్రమ అరెస్ట్‌లను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజలు రోడ్డెక్కి అన్యాయాలు ప్రశ్నిస్తూ తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ కూటమి ప్రభుత్వ దుర్మార్గ చర్య
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి