
లేనిపోని విమర్శలు
నెల్లూరు (పొగతోట): పౌరసరఫరాల శాఖలో నిబంధనలకు పాతరేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇటీవల తరలిస్తుండగా, నగరంలో ఏఎస్‌ఓ అంకయ్య పట్టు కున్నారు. ఈ వాహనాలను సీజ్ చేసి కొత్తూరులోని ఎమ్మెల్‌ఎస్ పాయింట్లకు తరలించారు.
ప్రైవేట్ వ్యక్తులతో పని
ఎమ్మెల్‌ఎస్ పాయింట్లలో పనిచేసే హమాలీలు సమ్మెలో ఉన్నారు. ఇదే విషయాన్ని సివిల్ సప్లయ్స్ డీఎం దృష్టికి తీసుకెళ్లగా.. లారీలను రేపు ఉదయం తీసుకురండి.. లేకపోతే ఎమ్మెల్‌ఎస్ పాయింట్లలో ఉంచాలని సమాధానమిచ్చారు. అయితే ఎమ్మెల్‌ఎస్ గోడౌన్లకు తరలించిన బియ్యాన్ని ప్రైవేట్ వ్యక్తులతో అన్‌లోడ్ చేయించారు. లారీల్లో ఎంత స్టాకు ఉందనే అంశమై వేయింగ్ మెషీన్ ద్వారా కాటా వేయించలేదనే విమర్శలూ ఉన్నాయి. ఎమ్మెల్‌ఎస్ పాయింట్లలోకి ప్రైవేట్ వ్యక్తులొచ్చి బియ్యాన్ని దించడం విమర్శలకు దారి తీసింది.
అంతా అయోమయం
వాస్తవానికి రేషన్ బియ్యం వాహనాలను అధికారులు పట్టుకున్న సమయాల్లో రాత్రయితే పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తారు. మరుసటి రోజు అధికారుల అనుమతితో గోడౌన్లకు తరలించి బియ్యం బస్తాలను నిల్వ చేస్తారు. రెండు నెలల క్రితం ఇదే పరిస్థితి తలెత్తగా, ఆ సమయంలో అంతా సవ్యంగా సాగింది. అయితే ఇటీవల పట్టుకున్న వాహనాలకు ఈ నిబంధనను ఎందుకు అమలు చేయలేదనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్‌ఎస్ పాయింట్లలోకి ప్రైవేట్ వ్యక్తులు రావడం, వీడియోలు తీయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సమయాల్లో నిబంధనల మేరకు బయటి వ్యక్తుల ఆధ్వర్యంలో పంచనామాను నిర్వహించాల్సి ఉంది. రేషన్ బియ్యామా.. నాణ్యమైందాననే అంశాన్ని నిర్ధారించి జేసీకి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ నాణ్యమైనవైతే వాహనాలకు రిలీవింగ్ ఆర్డర్‌ను ఇవ్వాల్సి ఉంది. గతంలో పట్టుకున్న వాహనాలకు ఈ ఆర్డర్లను జేసీ కాకుండా సీఎస్డీటీ ఇవ్వడం గమనార్హం.
రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఏఎస్‌ఓ
ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌లో
అనుమతి లేకుండా అన్‌లోడ్
హమాలీలు కాకుండా
ప్రైవేట్ వ్యక్తులతో తంతు
సివిల్ సప్లయ్స్ డీఎం మాట పెడచెవిన
పౌరసరఫరాల శాఖలో ఇదీ తీరు..
వాహనాలను పట్టుకున్నారనే నెపంతో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తే లేనిపోని విమర్శలు చేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. కూటమి నేతలను ప్రసన్నం చేసుకున్న మాఫియా డాన్ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం జరిగిపోతోంది. చౌకదుకాణం నుంచి సేకరించిన బియ్యంలో కొంత భాగాన్ని తనకున్న మూడు రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి బహిరంగ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. అధిక భాగాన్ని కృష్ణపట్నం, చైన్నె పోర్టుల ద్వారా ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ఈ తతంగం అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కాగా ఈ వ్యవహారమై ఏఎస్‌ఓ అంకయ్యను సంప్రదించగా, పట్టుకున్న బియ్యాన్ని ఎమ్మెల్‌ఎస్ పాయింట్లలో నిల్వ చేయడం నిబంధనల్లో ఓ భాగమని చెప్పారు. అధికారుల ఆదేశాలను ఉల్లంఘించలేదని, బయటి వ్యక్తులెవరో వచ్చి గోడౌన్లో అనుమతి లేకుండా వీడియోలు తీశారని తెలిపారు. వాహనాలను పట్టుకున్నాననే నెపంతో తనపై కక్షగట్టి ఇదంతా చేస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని బదులిచ్చారు.

లేనిపోని విమర్శలు