
పప్పు ధాన్యాల సాగు తగ్గుముఖం
పొదలకూరు: పొదలకూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో పప్పు ధాన్యాల సాగు గణనీయంగా తగ్గింది. అదునులో వర్షాలు కురిసినా, కురవకపోయినా కొంతకాలంగా అపరాల సాగు జోలికి మెట్ట రైతులు వెళ్లడం లేదు. ప్రధానంగా మినుము, పెసర, పచ్చిశనగ, కంది పంటలను పొదలకూరు, రాపూరు, చేజర్ల, కలువాయి, మనుబోలు మండలాల్లో సాగు చేస్తుంటారు. ఆగస్ట్, సెప్టెంబర్‌లో వర్షపాతా న్ని అనుసరించి వీటిని సాగు చేసేందుకు ఉపక్రమిస్తారు. ఫలితంగా రూ.కోట్లలో లావాదేవీలు ఈ ప్రాంతంలో జరుగుతుంటాయి.
20 వేల ఎకరాల్లో సాగు
ఈ నాలుగు మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో మినుము, పెసర పంటలను సాగు చేస్తుంటారు. దుక్కి దున్నడం మొదలుకొని పంటలకు పురుగుమందు పిచికారీ వరకు మెట్ట రైతులు సంక్రాంతి వరకు వ్యవసాయ పనుల్లో తలమునకలై ఉంటారు. రబీ సీజన్ నవంబర్ నుంచి ప్రారంభమైతే మాగాణి సేద్యం చేపట్టే రైతులకు ఊపిరిసలపని విధంగా ఉంటుంది. అయితే ఖర్చులు పెరగడమే కాకుండా అకాల వర్షాలతో మినుము, పెసర చేతికొస్తుందనే నమ్మకం సన్నగిల్లడంతో సాగు విస్తీర్ణాన్ని రైతులు గణనీయంగా తగ్గిస్తున్నారు.
ఆర్బీకేల ద్వారా గతంలో అవగాహన
గతంలో పంటల సాగుపై గ్రామాల్లో ఆర్బీకేల ద్వారా రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించే వారు. పంటల మార్పిడి పద్ధతికి అలవాటు పడాలని సూచి స్తున్నారు. ఖరీఫ్‌లో మినుము, పెసర పంటలనే సాగు చేయాలని లేదంటే అంతర్‌పంటగా కందిని వేస్తే నష్టపోవాల్సిన అవసరం ఉండదనే విషయన్ని తెలియజేస్తున్నారు. ఫలితంగా రైతులు పంటల మార్పిడికి మెల్లగా అలవాటు పడుతూ నష్టాలను చవిచూసే పంటల సాగును మానేస్తున్నారు.
దుక్కులు మొదలుపెట్టలేదు
పప్పుధాన్యాల సాగుకు రైతులు ఇప్పటి వరకు దుక్కులనే మొదలుపెట్టలేదు. నిమ్మ తోటల్లో అంతర్‌పంటగా కందిని సాగుచేస్తే మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మెట్ట పంటల సాగుపై త్వరలో అవగాహన కల్పించనున్నాం. దుక్కి పనులు పూర్తి చేస్తే సెప్టెంబర్‌లో కురిసే వర్షాలకు పప్పు ధాన్యాల విత్తనాలు విత్తుకునేందుకు వీలు ఏర్పడుతుంది.
– ప్రతాప్, ఏఓ, పొదలకూరు
కలిసిరాని మెట్ట పంటల సేద్యం
అన్నదాత దిగాలు
ఖరీఫ్‌లో అపరాల సాగు కష్టమే

పప్పు ధాన్యాల సాగు తగ్గుముఖం