
గిరిజనుల పేర్లతో రుణాల కుంభకోణం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఎస్సీ, ఎస్టీల పేరుతో యాక్సెస్ బ్యాంక్‌లో రూ.10.60 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై సీఐడీతో విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసీ పెంచలయ్య డిమాండ్ చేశారు. నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూలి పనులు చేసుకునే, పశువుల కాపరులైన ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇచ్చినట్లు యాక్సెస్ బ్యాంక్, లాయర్లు నోటీసులు పంపించడం దారుణమన్నారు. ఈ దోపిడీలో నిందితులైన జాలి వాసుదేవనాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చదువు, ధనం లేని తమ జాతి వారి పేర్లను, కార్డులను ఉపయోగించుకుని రుణాలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వారితోపాటు కొంత మంది బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉందని సమాచారం వస్తుందని, వారిపై కూడా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని అన్నారు. బాధితులు చలంచర్ల లక్ష్మీనారాయణ, ఆయన భార్య శేషమ్మ మాట్లాడుతూ తమకు ఏం తెలియకుండానే తమ పేరుతో రుణాలు తీసుకున్నారని, ఇప్పుడు వాటిని కట్టాలంటూ బ్యాంకు, చైన్నె లాయర్ నోటీసులు ఇచ్చారని విలపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యానాదుల సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ రాపూరు కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు మానికల మురళీ, ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్ర, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష పాల్గొన్నారు.
సీఐడీ విచారణ చేపట్టాలి
యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య