
పోలీసు, న్యాయవ్యవస్థల సమన్వయం కీలకం
● అర్ధ వార్షిక నేర సమీక్షలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్
నెల్లూరు (క్రైమ్): నేరాల నియంత్రణలో పోలీసు, న్యాయవ్యవస్థ నడుమ సమన్వయం కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పోలీసుశాఖ అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం నెల్లూరు ఉమేష్‌చంద్రా కాన్ఫరెన్స్‌హాల్లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే ఈ రెండు శాఖల సమన్వయంతోనే సాధ్యమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుని ప్రజా జీవనంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని పోలీసు అధికారులకు సూచించారు. నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఎస్పీ జి.కృష్ణకాంత్ జిల్లాలో నమోదైన గ్రేవ్, నాన్‌గ్రేవ్, ఆస్తి సంబంధిత నేరాలు, ఇతర కేసుల నమోదు, ఛేదనపై సర్కిల్స్ వారీగా పోలీసు అధికారులతో సమీక్షించారు. గ్రామ సందర్శనల పేరిట ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం ద్వారా పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్స్‌లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. గంజాయి, మట్కా, జూదం, ఇసుక అక్రమ రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.