
ఉద్రిక్తంగా మున్సిపల్ కార్మికుల ఉద్యమం
నెల్లూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. స్థానిక గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. మా కడుపులు కొట్టొద్దు, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్‌కు చేరుకున్న మున్సిపల్ కార్మికులు బైఠాయించి కలెక్టర్ వచ్చి తమ సమస్యల పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకొని గేట్లు వేశారు. కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాటలో నలుగురు మహిళా కార్మికులకు రక్త గాయాలయ్యాయి. ఇద్దరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. తోటి కార్మికులు వెంటనే వారిని ఆస్పత్రులకు తరలించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులతో పోలీసులు చర్చ జరిపి కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం యూనియన్ నాయకులు కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.మోహన్‌రావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి కె. పెంచలనరసయ్య మాట్లాడారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం పారిశుద్ధ్య కార్మికుల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలకు పాల్పడడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనిది మొట్టమొదటిగా నెల్లూరు నుంచే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే చర్యలకు మంత్రి పూనుకున్నారన్నారు. తక్షణమే పిలిచిన టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా నిర్ధాక్షిణ్యంగా పనిలో ఆపివేయడం తగదన్నారు. జీఓ నంబర్ 36 ప్రకారం ఇంజినీరింగ్ విభాగం కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నెల్లూరు నగర నాయకులు పి సూర్యనారాయణ, రూరల్ నాయకులు సుధాకర్, నాగేశ్వరరావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.
టెండర్లను రద్దు చేయాలంటూ ధర్నా
కలెక్టరేట్‌లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నం
భారీగా పోలీసులను మోహరించి
అడ్డుకున్న వైనం
మహిళా కార్మికులకు రక్తగాయాలు

ఉద్రిక్తంగా మున్సిపల్ కార్మికుల ఉద్యమం

ఉద్రిక్తంగా మున్సిపల్ కార్మికుల ఉద్యమం