
వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం
నెల్లూరు రూరల్: ‘ప్రజలు అందించే వినతులను పరిష్కరించే విషయంలో కొన్ని శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. సత్వరమే చర్యలు తీసుకోవాలి’ అని కలెక్టర్ ఒ.ఆనంద్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న తిక్కన ప్రాంగణంలో ఆనంద్, జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి హుస్సేన్ సాహెబ్, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అధికంగా రెవెన్యూ శాఖవి 103, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులవి 16, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌వి 16, పంచాయతీరాజ్‌వి 16, స్కూల్ ఎడ్యుకేషన్‌వి 15, పోలీస్ శాఖవి 11, ఇంకా తదితర శాఖలకు సంబంధించి మొత్తం 249 ఫిర్యాదులు వినతులందాయి.
● కలెక్టర్ మాట్లాడుతూ సర్వే, ఎడ్యుకేషన్, పోలీస్, గనుల శాఖ, డిజేబుల్ వెల్ఫేర్, దేవదాయ శాఖ తదితరాలు వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతి శాఖ కూడా ఫిర్యాదులు విషయంలో ఆడిట్ నిర్వహించుకోవాలని సూచించారు. వినతుల విషయంలో అలసత్వం ఉండకూడదని తెలిపారు.
ఇనాం భూమి ఆక్రమణ
ఇనాం భూములు ఆక్రమించి కంచె వేస్తున్నారని నెల్లూరు రూరల్ మండలం మట్టెంపాడు గ్రామస్తులు వినపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ ఇనాం రద్దు చట్టం వచ్చిన తర్వాత 350 ఎకరాలను తాళ్లపూడికి చెందిన మెట్ట రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వానికి సరెండర్ చేసి పరిహారం పొందారన్నారు. అందులో 110 ఎకరాల్లో పేదలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి పరిహారానికి 6 శాతం అదనంగా డబ్బు కట్టి 20 మంది పేర్లతో దొంగ పాసు పుస్తకాలు సృష్టించారన్నారు. ఈ పట్టాలు చెల్లవని అప్పటి కలెక్టర్ శ్రీకాంత్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఇప్పుడు మళ్లీ వాటిని చూపించి కంచె వేసి ఆక్రమించుకుంటున్నారని వాపోయారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను సంప్రదించగా సెక్షన్ 145 పెట్టి మెతక వైఖరి అవలంబిస్తున్నారని చెప్పారు.
కలెక్టర్ ఆనంద్ అసహనం
తగిన చర్యలు తీసుకోవాలని
అధికారులకు ఆదేశాలు
కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
249 వినతుల అందజేత