విశ్రాంతే మెదడుకు ఔషధం | - | Sakshi
Sakshi News home page

విశ్రాంతే మెదడుకు ఔషధం

Jul 22 2025 6:25 AM | Updated on Jul 22 2025 8:58 AM

విశ్ర

విశ్రాంతే మెదడుకు ఔషధం

నెల్లూరు(అర్బన్‌): శరీరంలో అతి ముఖ్యమైన అవయవం మెదడు. దాని పనితీరు బాగుంటేనే చురుగ్గా పని చేయగలుగుతారు. అయితే నేడు పరిస్థితులు మరోలా ఉన్నాయి. జంక్‌ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. ఇంకోవైపు కాలుష్యం పెరిగిపోయింది. సమయపాలన లేకుండా పగలు, రాత్రి ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకో వైపు మొబైల్‌ స్క్రీన్లకు అలవాటు పడి అర్ధరాత్రి వరకు నిద్ర పోవడంలేదు. దీంతో మెదడుపై ఒత్తిడి పెరిగింది. గతానికి భిన్నంగా ఆటో ఇమ్యూన్‌ ఎన్సెఫాలిటిస్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌, బ్రెయిన్‌ ట్యూమర్‌, మతిమరుపు, పార్కిన్‌సన్స్‌ (వణుకుడు జబ్బు) బారిన పడుతున్నారు. వెరసి మెదడు ఆరోగ్యాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో భాగమైన వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ న్యూరాలజీ (డబ్ల్యూఎఫ్‌ఎన్‌) ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రపంచ మెదడు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 22వ తేదీన నిర్వహిస్తోంది. నరాల సంబందిత వ్యాధి నిపుణుల ఆధ్వర్యంలో జిల్లాలో మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

60 శాతానికి పైగా..

జిల్లాలో 60 శాతానికి పైబడి ప్రజలు ఒత్తిడితోనే జీవిస్తున్నారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పేర్కొంటోంది. ఒత్తిడి, బీపీ, షుగర్‌ వల్ల కూడా అనేక రకాల మెదడు సమస్యలు వస్తున్నాయి. మెదడు, నరాలు పనితీరు లోపించడంతో 50 ఏళ్ల వయసు పైబడిన వారికి మతిమరుపు, పార్కిన్‌సన్స్‌ లాంటి జబ్బులు వస్తున్నాయి. ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరిగింది.

పెద్దాస్పత్రిలో ఇలా..

నెల్లూరులోని ప్రభుత్వ పెద్దాస్పత్రి న్యూరాలజీ విభాగానికి నెలకు సుమారు 350 మందికి పైగా రోగులు వస్తున్నారు. నారాయణ ఆస్పత్రిలో ఆ సంఖ్య వెయ్యిగా ఉంది. అలాగే మెడికవర్‌, అపోలో ఆస్పత్రి, కిమ్స్‌ తదితర చోట్ల మరో 5 వేల మంది, ఇతర న్యూరాలజీ డాక్టర్ల వద్దకు వచ్చే వారితో కలిపితే నెలకు జిల్లాలో సుమారు 10 వేల మంది రోగులు వైద్యం కోసం వెళ్తున్నారు. వీరిలో 30 శాతానికి పైగా రోగులు మెదడు సంబంధిత రోగులుగా ఉన్నట్లు అంచనా. కొంతమందికి మతిమరుపు ఉంది. మరికొందరు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఇంకొంతమంది పార్కిన్‌సన్స్‌ (వణుకుడు) జబ్బుతో బాధపడుతున్నారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ లాంటి సమస్యలు వస్తే కోలుకోవడం కష్టంగానే ఉంటుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే..

రోజూ 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, ప్రాణాయామం చేయాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. జంక్‌ఫుడ్‌ జోలికి వెళ్లకూడదు. అన్నం, గోధుమ పిండి, చక్కెరలు సాధ్యమైనంత వరకు తగ్గించాలి. పుస్తకాలు చదవాలి. ఫిజికల్‌ యాక్టివిటీస్‌ జరగాలి. అప్పుడు మెదడుపై ఒత్తిడి తగ్గి పలు రకాల జబ్బులు అరికట్టబడతాయి. అయితే వైరస్‌ల వల్ల వచ్చే జపనీస్‌ ఎన్సెఫాలిటిస్‌ లాంటి జబ్బులకు మొదట్లోనే చికిత్స తీసుకుంటే ఇబ్బంది ఉండదు.

అవగాహన తప్పనిసరి

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలు తగిన అవగాహన పెంచుకోవాలి. ఒత్తిడి వల్ల వచ్చే బ్రెయిన్‌స్ట్రోక్‌, మతిమరుపు, పార్కిన్‌సన్స్‌ లాంటి జబ్బులను అరికట్టాలంటే రాత్రి పూట తగినంత నిద్ర అవసరం. పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయామం తప్పనిసరి. కాలుష్యానికి దూరంగా ఉండాలి.

– డాక్టర్‌ ధీరజ్‌, న్యూరోసర్జన్‌, జీజీహెచ్‌

ఒత్తిడి, జంక్‌ఫుడ్‌, కాలుష్యం,

నిద్రలేమితో భారం

పెరుగుతున్న బ్రెయిన్‌ సంబంధిత

వ్యాధిగ్రస్తులు

అవగాహనతోనే చెక్‌

నేడు ప్రపంచ బ్రెయిన్‌ ఆరోగ్య దినోత్సవం

విశ్రాంతే మెదడుకు ఔషధం1
1/1

విశ్రాంతే మెదడుకు ఔషధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement