రూ.కోట్లల్లో వ్యాపారం.. వందల్లో చెల్లింపు
రూ.200 దాటితే బిల్లు జారీ తప్పనిసరి
మలుకు నోచుకోని నిబంధన
మొక్కుబడిగా రిటర్న్స్ దాఖలు
జోరుగా జీరో వ్యాపారం
రాబడి తగ్గుముఖం
నెల్లూరు డివిజన్లో జీఎస్టీ వసూళ్లలో ఇదీ తంతు
నెల్లూరు (టౌన్): నెల్లూరు జీఎస్టీ డివిజన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా రంగాల్లో కోట్లల్లో వ్యాపారం జరుగుతున్నా.. చెల్లించే జీఎస్టీ రూ.వందల్లోనే ఉంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కస్టమర్ల నుంచి క్రమం తప్పకుండా వసూలు చేసినా, ప్రభుత్వానికి మాత్రం పంగనామం పెడుతున్నారు. రూ.20 లక్షల్లోపు వ్యాపారం ఉంటే ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదనే నిబంధనను బూచిగా చూపి ఎక్కువ మంది ఎగ్గొడుతున్నారు.
నిబంధనలు బేఖాతర్
వాస్తవానికి అమ్మకాలు రూ.200 దాటితే జీఎస్టీ నంబర్‌తో కూడిన బిల్లును ఇవ్వాలనే నిబంధన ఉన్నా, నెల్లూరు డివిజన్ పరిధిలో ఎక్కడా అమలు కావడం లేదు. జీఎస్టీకి సంబంధించిన రిటర్న్స్‌ను మూడు నెలలకోసారి వ్యాపారులు దాఖలు చేయాల్సి ఉన్నా, అదీ మొక్కుబడిగానే జరుగుతోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా, మామూళ్లతో మిన్నకుండిపోతున్నారనే విమర్శలున్నాయి.
వసూళ్లు 25 శాతం పతనం
నెల్లూరు డివిజన్, జిల్లాకు సంబంధించిన జీఎస్టీ రాబడి తగ్గిందని తెలుస్తోంది. వాస్తవానికి దాదాపు రూ.1200 కోట్ల రెవెన్యూ రావాల్సి ఉండగా, 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.900 కోట్లు దాటలేదని సమాచారం. ఈ లెక్కన వసూళ్లు 25 శాతానికిపైగా పతనమయ్యాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియసైందని సమాచారం. అయితే టార్గెట్, సాధించిన లెక్కలపై జీఎస్టీ అధికారులను ప్రశ్నిస్తే, బయటకు చెప్పకూడదనే సమాధానమిస్తున్నారు.
ఎక్కువగా వసూలయ్యేది వీటి నుంచే..
నెల్లూరు డివిజన్లో మోటార్ వెహికల్స్ నుంచి రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. ఆ తర్వాత వెజిటబు ల్ అయిల్, పోర్టు ఆధారిత అంశాలు, పొగాకు, ఎర్త్ మూవింగ్ పరికరాలు, జ్యువెలర్స్, ఐరన్ అండ్ స్టీల్, ఎలక్ట్రానిక్స్, రెడీమేడ్ వస్త్రాలు, గ్రానైట్, హోటళ్లు, రియల్ ఎస్టేట్ తదితరాల నుంచి ఉంటుంది. అయితే ఎందులోనూ ఆశించిన స్థాయిలో రాబడి రాలేదు.
నర్తకి సెంటర్‌లోని జీఎస్టీ కార్యాలయం
జీఎస్టీలోకి వచ్చే డీలర్లు – 26 వేలకు పైగా
కాంపోజిషన్ ట్యాక్స్ చెల్లింపుదారులు – 2400 మందికిపైగా
జీరో దందాకు అడ్డుకట్టేదీ..?
జిల్లాలో ఇలా..
జిల్లాలో లెక్క ఇదీ..
నెల్లూరు డివిజన్ పరిధిలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలున్నాయి. జిల్లాలో నెల్లూరు – 1, 2, 3, కావలి.. ప్రకాశం జిల్లాలో ఒంగోలు 1, 2, మార్కాపురం సర్కిళ్లున్నాయి.
డివిజన్ పరిధిలో 26 వేల మందికిపైగా డీలర్లు జీఎస్టీ పరిధిలోకి వస్తారు. ఏడాదికి రూ.1.5 కోట్ల ఆదాయమొచ్చే డీలర్లు 21 వేల మందికిపైగా ఉన్నారు. వీరంతా ప్రతి నెలా రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఏడాదికి రూ.50 లక్షల్లోపు రాబడి వచ్చే వారిని కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్‌గా పరిగణిస్తారు. డివిజన్ పరిధిలో వీరి సంఖ్య ఐదు వేలకుపైగా ఉంటుంది. వీరు ప్రతి మూడు నెలలకోసారి రిటర్న్స్‌ను దాఖలు చేయాలి.
జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. వినియోగదారుడు రూ.200కుపైగా ఏ వస్తువును కొనుగోలు చేసినా, జీఎస్టీ నంబర్‌తో కూడిన బిల్లును దుకాణ యజమాని తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు జిల్లాలోని అధిక శాతం హోటళ్లలో బిల్లులివ్వని పరిస్థితి నెలకొంది. నిజానికి సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కింద తొమ్మిది శాతం చొప్పున 18 శాతాన్ని బిల్లులో వేస్తారు. లక్షల్లో వ్యాపారం జరుగుతున్నా, వేలల్లోనే రిటర్న్స్‌ను దాఖలు చేస్తున్నారు. బిల్లుల్లేకుండానే చైన్నె, బెంగళూరు, తదితర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో బంగారు నగలను తీసుకొస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి జీఎస్టీని చెల్లించరు. ఈ విషయం అధికారులకు తెలిసినా, నెలవారీ మామూళ్లతో మిన్నకుండిపోతున్నారు. చిన్నస్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి నెలా ముట్టజెప్తున్నామని వ్యాపారులే చెప్తున్నారు. ఇలా వ్యాపారులు పెద్ద మొత్తంలో జీఎస్టీని ఎగ్గొట్టి ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు.
రెవెన్యూ విషయాలు బయటకు చెప్పకూడదు
జీఎస్టీకి సంబంధించిన లక్ష్యాలు, సాధించిన అంశాలను బయటకు చెప్పకూడదు. ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టి సారించాం. రిటర్న్స్‌ను ప్రతి ఒక్కరూ దాఖలు చేయాల్సి ఉంది. అలా వ్యవహరించకపోతే చర్యలు చేపడతాం. తనిఖీల్లో బయటపడితే చర్యలు చేపడతాం.
– రవీంద్రనాథ్‌రెడ్డి, జీఎస్టీ ఉప కమిషనర్


