
కాకాణి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు
● మాజీ మంత్రి కారుమూరి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. చట్టాలపై, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని కాకాణిపై పెట్టిన ఆధారాల్లేని కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. మంగళవారం ఆయన నెల్లూరు సిటీ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి నెల్లూరు డైకాస్‌రోడ్డులోని కాకాణి నివాసంలో వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. కాకాణిపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు నిలువదన్నారు. తప్పుడు కేసులతో వైఎస్సార్‌సీపీ నేతలను బెదిరించాలనుకుంటే బెదిరే వాళ్లు ఎవరూ లేరన్నారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ తప్పుడు కేసులు పెట్టే అధికారులు, పోలీసులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మనోధైర్యంతో ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు. గోవర్ధన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.