
అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరికివేత
● మళ్లీ విజృంభించిన మాఫియా
● అధికార పార్టీ నేతల ప్రమేయంపై ప్రచారం
ఉదయగిరి: మండలంలోని తిరుమలాపురంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో జామాయల్ చెట్లను కలప మాఫియా నరికివేస్తోంది. ఆ గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 70 ఎకరాల్లో 15 ఏళ్ల క్రితం జామాయిల్ మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి బాగా ఏపుగా పెరిగాయి. దీంతో వీటిపై కన్నేసిన కొంత మంది అక్రమార్కులు నరికేస్తున్నారు. నేలటూరుకు చెందిన ఇత్తడి శ్రీను అనే వ్యక్తి మంగళవారం మూడు లారీల్లో 70 మంది కూలీలతో ఆ చెట్లు నరికి కర్రను లారీలకు లోడ్ చేస్తున్నాడు. సీఐడీ స్వాధీనత భూముల్లో చెట్లు నరికివేస్తున్నట్లు స్థానికులు కొందరు పోలీస్ డయల్ 100కు కాల్ చేశారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు బయల్దేరే క్రమంలో ఓ పోలీసు ఉన్నతాధికారి అదేశాలతో చాలా సేపటికి చేరుకున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ పెద్దల ప్రమేయం ఉన్నందున ఆ అధికారి స్థానిక పోలీసులను తొందర పడకుండా వేచి చూడాలని చెప్పినట్లు సమాచారం. అయితే స్థానికులు పదేపదే పైఅధికారులకు ఫిర్యాదు చేయడం, మీడియా ప్రతినిధులు అక్కడి వెళ్లడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చెట్ల నరికివేతను నిలిపివేశారు. ఈ ఒక్క రోజే సుమారు 5 ఎకరాల్లో సుమారు 100 టన్నుల కర్ర నరికేసినట్లు అంచనా వేస్తున్నారు.
సంకటంలో పోలీసులు
ఈ వ్యవహారంలో అధికార పార్టీ పెద్దల హస్తం ఉండడంతో పోలీసులు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారంతో చెట్ల నరికివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే చెట్ల నరికివేతపై సీఐడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంది. వారు సాయంత్రం వరకు రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు ఎవరిపై కేసులు నమోదు చేయడం గానీ, వాహనాలు స్వాధీనం చేసుకోవడం కానీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై స్థానిక ఎస్సై ఇంద్రసేనారెడ్డిని వివరణ కోరగా ఈ వ్యవహరంపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఎవరైనా ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరికివేత

అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరికివేత