నెల్లూరు (వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మంగళవారం రాపూరు షెడ్యూల్డ్ తెగల దీన్‌ధన్ వికాస సహకార సంఘాన్ని జిల్లాలో ఏర్పాటు చేసినట్లు జిల్లా సహకారశాఖాధికారి (డీసీఓ) గుర్రప్ప తెలిపారు. నగరంలోని డీసీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రాచీన గిరిజన తెగకు చెందిన యానాది కుటుంబాలను సమీకృతం చేసి వారి జీవనోపాధిని పెంచేందుకు దోహదపడుతుందన్నారు. రాపూరు మండలంలోని వెలిగొండ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వెయ్యి యానాది కుటుంబాలను ఈ సంఘంలో చేర్పించి కలపేతర అటవీ ఫలసాయాలు, ముడి సరుకుల ఉత్పత్తులను బ్రాడింగ్ చేసి, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం ద్వారా వీరికి ఆర్థిక సాధికారతను కల్పించేందుకు ఈ సహకార సంఘం ఉపయుక్తంగా పనిచేస్తుందన్నారు. సంఘ సభ్యులకు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ నెల్లూరు (ఐటీడీఏ) ద్వారా నైపుణ్యం పెంపు, మార్కెటింగ్‌పై శిక్షణ కల్పిస్తామన్నారు. అనంతరం సంఘ సభ్యులకు సంఘ నిర్వహణ, ఆశయాలు, సభ్యత్వం, సమావేశాలు, ఎన్నికలు, రికార్డుల నిర్వహణ, ఆడిట్‌పై శిక్షణ ఇచ్చారు. సంఘ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బైలాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాపూరు సబ్ డివిజన్ సహకార అధికారి రవికుమార్, ఏపీఓ రమణయ్య, ఐటీడీఏ మేనేజర్ బాలాజీ, డీసీఓ కార్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరి, సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
29 నుంచి వికసిత్ కృషి
సంకల్ప అభియాన్
నెల్లూరు (పొగతోట): భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేవీకే సమన్వయకర్త డాక్టర్ జి.లలితశివజ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ముందస్తు వ్యవసాయ ప్రణాళికగా కేవీకే బృందం, ఇతర శాస్త్రవేత్తలు, అధికారులు కలిసి జిల్లా వ్యాప్తంగా పర్యటించనున్నామన్నారు. కొత్తరకం వంగడాలు, సాంకేతికతలపై రైతులతో అధికారులు చర్చించనున్నారు. పశు సంపద, పశువుల ఉత్పత్తి, సేంద్రియ వ్యవసాయం మొదలగు అంశాలపై సందర్శన చేపడుతామని తెలిపారు.
హుండీల్లో కానుక లెక్కింపు
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి ఆలయంలోని హుండీల్లో కానుకల లెక్కింపు మంగళవారం దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఈఓ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ హుండీలు, అన్నప్రసాద హుండీల ద్వారా రూ.15,77,517 లక్షల కానుకలు వచ్చాయని తెలిపారు. అందులో బంగారం 112 గ్రాములు, వెండి 24 గ్రాములు, యూఏఈ దిరామ్స్ 10 భక్తులు సమర్పించారని వివరించారు. బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
షెడ్యూల్డ్ తెగల సహకార సంఘం ఏర్పాటు