
మంత్రి హామీతో సమ్మె విరమణ
● డీఎంహెచ్‌ఓకు సీహెచ్‌ఓల వినతి పత్రం
నెల్లూరు (అర్బన్): తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హామీ ఇవ్వడంతో తాము చేస్తున్న సమ్మెను విరమించి తక్షణమే విధుల్లోకి చేరుతున్నామని సీహెచ్‌ఓలు తెలిపారు. సోమవారం డీఎంహెచ్‌ఓ సుజాతకు సీహెచ్‌ఓ అసోసియేషన్ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భానుమహేష్ మాట్లాడుతూ తమ సంఘ రాష్ట్ర నాయకులు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌తో పలు అంశాలపై చర్చించారన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, సమ్మెను విరమించాలని కోరారన్నారు. దీంతో తాము సమ్మెను విరమిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రుబేకా, జిల్లా కోఆర్డినేటర్ ఆదిల్, నాయకులు, జ్యోతి, సుమాంజలి, హెప్సిబా, నవీన్, హనుమానాయక్, కోశాధికారి అనూష తదితరులు పాల్గొన్నారు.
పట్టుబడుతున్నా..
ఆగని రవాణా
సంగం: చికెన్ వ్యర్థాల ఆక్రమ రవాణా ఆగడం లేదు. వారం రోజుల వ్యవధిలో సుమారు 500కు పైగా చికెన్ వేస్ట్ ఉన్న డ్రమ్ములను అధికారులు పట్టుకున్నారు. తాజాగా సోమవారం సుమారు 80 డ్రమ్ముల చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని సంగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వాహనంలోని చికెన్ వేస్ట్‌ను సమీపంలోని కొండ ప్రాంతం వద్దే భారీ గుంత తీసి పూడ్చివేశారు. వాహనం డ్రైవర్, యజమానిపై కేసులు నమోదు చేశారు. ఇలా ప్రతి నిత్యం వాహనాలను పట్టుకుంటున్న అధికారులు అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసు కుని వారిపై కూడా చర్యలు తీసుకుంటే రవాణా ఆగిపోతుందని ప్రజలు భావిస్తున్నారు.
మై భారత్ పోర్టల్‌లో
పేర్లు నమోదు చేసుకోండి
నెల్లూరు రూరల్: యువతకు సాధికారత కల్పించడం, వారి అభివృద్ధి, దేశ నిర్మాణానికి తోడ్పడానికి అవకాశాలు, వనరులు పొందడానికి కేంద్ర, రాష్ట్ర యువజన వ్యవహారాల శాఖ యువత మైభారత్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సెట్నల్ సీఈఓ ఏ నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. మై భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడంలో ప్రధాన లక్ష్యం యువత ఆలోచనలు, అభిప్రాయాలను, సూచనలను వ్యక్తిగతంగా, సమష్టిగా తెలుసుకోవడం, సమాజాభివృద్ధిలో యువత పాత్రను పంచుకోవాలన్నారు. జిల్లాలోని యువతీ, యువకులు ఎక్కువ సంఖ్యలో తమ పేర్లను పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.
జిల్లాలో మోస్తరు వర్షాలు
నెల్లూరు (అర్బన్): జిల్లాలో ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు కొన్ని చోట్ల భారీవర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా దుత్తలూరు మండలంలో 43.6 మి.మీ. వర్షం కురిసింది. నెల్లూరు అర్బన్‌లో అత్యల్పంగా 1.4 మి.మీ. కురిసింది. కొండాపురం 37.6 మి.మీ., లింగసముద్రం 33.0, గుడ్లూరు 24.2, సైదాపురం 20.4, ఉదయగిరి 20.4, రాపూరు 19.6, వెంకటాచలం 18.4, తోటపల్లిగూడూరు 17.8, వలేటివారిపాళెం 17.4, పొదలకూరు 17.4, వరికుంటపాడు 15.4, జలదంకి 14.2, వింజమూరు 12.8, కందుకూరు 12.4, ఉలవపాడు 12.2, మర్రిపాడు 12.2, దగదర్తి 11.8, కలిగిరి 10.6, మనుబోలు 10.4, ముత్తుకూరు 10.2, ఆత్మకూరు 9.2, కావలి 8.6, అనుమసముద్రంపేట 8.4, అనంతసాగరం 8.2, ఇందుకూరుపేట 7.4, కలువాయి 7.2, నెల్లూరు రూరల్ 2.6, చేజర్ల 2.4, సీతారామపురం 2.0 మి.మీ. మేర వర్షం కురిసింది.

మంత్రి హామీతో సమ్మె విరమణ

మంత్రి హామీతో సమ్మె విరమణ