
పత్రాలు పరిశీలించి.. వివరాలు సేకరించి..
● టిడ్కో గృహ సముదాయంలో
కార్డన్ సెర్చ్
● అణువణువూ జల్లెడ
● 45 ద్విచక్ర వాహనాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు భగత్‌సింగ్‌కాలనీలోని టిడ్కో గృహ సముదాయంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. జిల్లాలో నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించేందుకు ఎస్పీ జి.కృష్ణకాంత్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలు, నగర శివారు ప్రాంతాలతోపాటు టిడ్కో గృహ సముదాయాల్లో కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. గురువారం నలుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది ఎస్సైలతోపాటుగా సుమారు 100 మంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి భగత్‌సింగ్‌కాలనీలోని టిడ్కో గృహ సముదాయాల్లో తనిఖీలు చేశారు. ఇంటి యజమానితోపాటు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించారు. వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. వాహనపత్రాలు సక్రమంగా లేని 45 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నవాబుపేట పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఫిన్స్‌తో అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను సేకరించి పోలీసు రికార్డులతో పోల్చి చూశారు. ఏ ప్రాంతం వారు?, ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు?, ఏం చేస్తున్నారు? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేర నియంత్రణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత చెడువ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని, సన్మార్గంలో నడవాలని సూచించారు.
ప్రజలు సహకరించాలి
నేరనియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్‌లకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కృష్ణకాంత్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమవంతు బాధ్యతగా అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగంపై డయల్ 112, 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్డన్ సెర్చ్‌లో నవాబుపేట, సంతపేట, దర్గామిట్ట, వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్లు వేణుగోపాల్‌రెడ్డి, దశరథరామయ్య, రోశయ్య, శ్రీనివాసరావు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పత్రాలు పరిశీలించి.. వివరాలు సేకరించి..