
భూసేకరణ ప్రక్రియ వేగవంతం
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో గురువారం రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్‌బీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వే ఆర్‌ఓబీలు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, ఏపీఐఐసీ, మెగా ఇండస్ట్రియల్ హబ్ మొదలైన వాటికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను వెంటనే పూర్తి చేయాలన్నా రు. ముఖ్యంగా అవార్డు చేసిన భూములకు సంబంధించి పొజిషన్ పూర్తయి చెల్లింపులు జరగని వారి విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే ప్రాజెక్ట్‌లకు కొన్నిచోట్ల మ్యుటేషన్స్ పెండింగ్‌లో ఉన్నట్లుగా గుర్తించామన్నారు. అవార్డు అయ్యాక చెల్లింపులు చేసిన తర్వాత మ్యుటేషన్స్ కూడా పూర్తి చేస్తేనే ఆయా భూములను సంబంఽధిత ప్రాజెక్ట్ వారికి పూర్తిస్థాయిలో అందజేసినట్లు అవుతుందన్నారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి కె.మహబూబ్‌బాషా, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శివకుమార్, నెల్లూరు, ఆత్మకూరు, కావలి ఆర్డీఓలు అనూష, పావని, వంశీకృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హుస్సేన్ సాహెబ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ గంగాధర్, సోమశిల ప్రాజెక్ట్ ఎస్‌ఈ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ ఆనంద్