
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పైలట్ల నిరసన
● మూడు నెలలుగా జీతాలివ్వని ప్రభుత్వం
నెల్లూరు (అర్బన్): తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) వాహనాల్లో పనిచేస్తున్న పైలట్లు తమ సమస్యలను తీర్చాలని కోరుతూ మంగళవారం ఒక్క రోజు సమ్మె చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఏపీ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే మస్తాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు జరిగిన తర్వాత తల్లీబిడ్డను ఇంటికి క్షేమంగా చేర్చేందుకు 2015లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. నాటి నుంచి నేటి వరకు కేవలం రోజుకు రూ.262 చొప్పున నెలకు రూ.7,870 మాత్రమే జీతంగా అందుకుంటున్నామన్నారు. ఆ జీతాలను కూడా గత మూడు నెలలుగా ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ పొందిన అరబిందో సంస్థ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోక పోవడం దుర్మార్గమన్నారు. మూడు నెలలుగా వాహనాలకు సంబంధించి పెట్రోల్ ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు తిరగడం లేదన్నారు. కాన్పునకు వచ్చిన పేద మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమతో 104 వాహనాల్లో విధులను కూడా బలవంతంగా చేయిస్తున్నారన్నారు. సెలవులు అసలు లేవన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నెలకు రూ.18,500 కనీస వేతనం ఇవ్వాలని, పీఎఫ్ వాటాను యాజమాన్యం చెల్లించాలని, పండగలు, వారాంతపు సెలవులు ఇవ్వాలని కోరారు. వాహనాల మరమ్మతులను వెంటనే చేపట్టాలని కోరారు. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలన్నారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, తమను ఆప్కాస్ ఏజెన్సీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు రూ.7లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యాక్షుడు సునీల్‌రెడ్డి, మహేష్, ఫయాజ్, అమీర్, రఫీ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.