
ప్రాణం ఖరీదు రూ.6 లక్షలు
కావలి (జలదంకి): కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఏరియా వైద్యశాలలో చేరి వైద్యుల నిర్లక్ష్యానికి బలైపోయిన బాలింత కుటుంబానికి రూ.6 లక్షలు పరిహారంగా ఇచ్చే విధంగా రాజీ జరిగినట్లు సమాచారం. కావలి మండలం మద్దూరుపాడుకు చెందిన రావినూతల జనార్దన్ భార్య సునీత ఇటీవల ఓ ప్రైవేట్ వైద్యశాలలో కాన్పు జరిగింది. ఈ నేపథ్యంలో వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకునేందుకు సోమవారం కావలి ఏరియా వైద్యశాలలో అడ్మిట్ కాగా ఓ మహిళా డాక్టర్ ఆపరేషన్ చేసింది. గంట వరకు మత్తు ఉంటుందని బంధువులకు తెలిపింది. గంట తర్వాత కూడా సునీత స్పృహలోకి రాకపోవడంతో వైద్యులకు విషయాన్ని తెలపడంతో వారు వచ్చి పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆమె బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే సునీత మృతి చెందిందంటూ ఆందోళనకు దిగారు. అయితే వైద్యులు మాత్రం ఆపరేషన్ అనంతరం భయాందోళనతోనే గుండెపోటు వచ్చి మరణించి ఉండొచ్చని తెలిపారు. దీంతో కావలి ఒకటో పట్టణ ఎస్సై సుమన్ అక్కడికి చేరుకుని సునీత బంధువులు, వైద్యులతో మాట్లాడారు. మంగళవారం కూడా బంధువులు ఆందోళనకు దిగడంతో వైద్యులు రూ.6 లక్షలు సునీత కుటుంబ సభ్యులకు పరిహారంగా ఇచ్చేలా రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.
ఏరియా వైద్యశాల డాక్టర్ల నిర్లక్ష్యానికి బాలింత మృతి
బంధువుల ఆందోళనతో కుదిరిన రాజీ